వామ్మో. స్పీడ్‌ గన్‌!

1 Oct, 2019 09:16 IST|Sakshi

వేగానికి చెక్‌పెడుతున్న యంత్రం

జరిమానాలకు జంకుతున్న వాహనదారులు

స్వీయ నియంత్రణ పాటిస్తున్న వైనం

తగ్గుతున్న ప్రమాదాలు

కామారెడ్డికి చెందిన రాజు కారులో హైదరాబాద్‌కు  బయలుదేరాడు. స్పీడ్‌గన్‌ భయంతో వాహనాన్ని 80 కిలోమీటర్ల వేగం దాటనివ్వలేదు. అయితే ఇతర వాహనాలు ఓవర్‌టేక్‌ చేస్తుండడంతో కొంత అసహనానికి గురై వేగం పెంచాడు. హైదరాబాద్‌ సమీపానికి వెళ్లేసరికి అతడి మొబైల్‌ ఫోన్‌కు మెస్సేజ్‌ వచ్చింది. అతివేగంతో వాహనాన్ని నడిపినందుకు రూ. 9 వందల ఫైన్‌ పడింది. దీంతో అతడు కంగుతిన్నాడు. తిరుగు ప్రయాణంలో పరిమిత వేగంతోనే వాహనాన్ని నడుపుతూ ఇంటికి చేరుకున్నాడు.

బాల్కొండకు చెందిన కారు ఓనర్‌ కం డ్రైవర్‌ ఎయిర్‌పోర్టుకు కిరాయికి వెళ్లాడు. ఎప్పటిలాగే కారు నడుపుతున్నాడు. అయితే మేడ్చల్‌ వద్ద స్పీడ్‌గన్‌ ఉంటుందనే ఉద్దేశంతో వేగం తగ్గించాడు. పోలీసులు స్పీడ్‌ గన్‌ ఉంచిన ప్రదేశాన్ని మార్చారు. దీన్ని గమనించని సదరు కారు యజమాని మేడ్చల్‌ దాటగానే కారు వేగం పెంచాడు. కారు ఎయిర్‌పోర్టుకు చేరిందో లేదో అతడి ఫోన్‌కు స్పీడ్‌ లిమిట్‌ అతిక్రమించినట్టు పేర్కొంటూ రూ.1100 జరిమానా విధిస్తూ మెసేజ్‌ వచ్చింది. 

సాక్షి, కామారెడ్డి: అతివేగంగా వెళ్లే వాహనదారులకు చెక్‌ పెట్టేందుకు పోలీస్‌శాఖ ప్రవేశపెట్టిన ‘స్పీడ్‌గన్‌’ సత్ఫలితాలు ఇస్తోంది. 44వ నంబర్‌ జాతీయ రహదారిపై పలు చోట్ల స్పీడ్‌ గన్‌లు ఏర్పాటు చేసి, అతివేగంగా వెళ్తున్న వాహనాలకు జరిమానాలు విధిస్తున్నారు. దీంతో జరిమానాలకు భయపడుతున్న చాలామంది వాహనదారులు 80 కిలోమీటర్ల వేగాన్ని దాటడానికీ జంకుతున్నారు. ప్రమాదాల నివారణకు పోలీస్‌ శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. రహదారి నిబంధనలను అతిక్రమిస్తున్నవారిని గుర్తించేందుకు స్పీడ్‌ గన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ప్రధాన రహదారులపై అక్కడక్కడ అమర్చి, వేగ నిబంధనలను అతిక్రమించేవారిని గుర్తించి, జరిమానాలు విధిస్తున్నారు. ఎన్‌హెచ్‌–44 పై అక్కడక్కడ స్పీడ్‌ గన్‌ల ను అమర్చుతున్నారు. నిర్ణీత వేగం కన్నా ఎక్కు వ స్పీడ్‌తో వాహనాన్ని నడిపితే.. ఇవి గుర్తించి, వెంటనే సంబంధిత వాహన యజమాని సెల్‌ఫోన్‌కు జరిమానాకు సంబంధించిన మెసేజ్‌ పంపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో వెళ్లాల్సిన స్పీడ్‌ కన్నా ఎక్కువ స్పీడ్‌తో వెళ్తే చాలు భారీ జరిమానాలు పడుతున్నాయి. హైవేపై ఏ మూలమ లుపు వద్ద, ఏ చెట్టు నీడన వేగ నియంత్రణ కెమెరా దాగి ఉందోనని డ్రైవర్లు గమనిస్తూ వాహనాలను మెల్లిగా నడుపుతున్నారు. డ్రైవర్ల కళ్లు దాదాపుగా స్పీడ్‌గన్‌ల గురించి దారిపొడవునా వెతుకుతూనే ఉన్నాయి.  

బస్వాపూర్‌నుంచి బుస్సాపూర్‌ వరకు.. 
44వ నంబరు జాతీయ రహదారి బెంగుళూరు నుంచి నాగ్‌పూర్‌ వరకు ఉంది. జాతీయ రహదారి కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు మండలం బస్వాపూర్‌ వద్ద మొదలై, నిజామాబాద్‌ జిల్లాలోని మెండోర మండలం బుస్సాపూర్‌ మీదుగా నిర్మల్‌ జిల్లాలోకి అడుగిడుతుంది. అయితే ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల నుంచి నిత్యం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వేలాది వాహనాలు పరుగులు తీస్తుంటాయి. ముఖ్యంగా సామగ్రిని తరలించే లారీలు, డీసీఎంలతో పాటు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, కా ర్లు, జీపులు భారీ సంఖ్యలో వెళతాయి. కామారె డ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన వారు తమ పిల్లల ఉన్నత చదువుల విషయంలో, వ్యాపారరీత్యా కొందరు, ఉద్యోగరీత్యా కొందరు.. ఇలా నిత్యం వేలాది మంది తమ కార్లు, ఇతర వాహనాల్లో హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే దారి బాగుండడంతో వాహనాల వేగాన్ని పెంచేస్తుంటారు.

అతివేగం ప్రమాదాలకు కారణమవుతుండడంతో దీనికి కళ్లెం వేయడానికి పోలీస్‌ శాఖ స్పీడ్‌ గన్‌లను తీసుకువచ్చింది. మేడ్చల్‌ పట్టణ పరిసరాలు, తూప్రాన్‌ పరిసరాలతో పాటు రామాయంపేట, భిక్కనూరు, కామారెడ్డి, సదాశివనగర్, ఇందల్వాయి, డిచ్‌పల్లి శివారు, ఆర్మూర్‌ తదితర ప్రాంతాల మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై పలుచోట్ల స్పీడ్‌ గన్‌లను ఏర్పాటు చేశారు. అయితే వాహనాల యజమానులు దీనిని గమనించి, ఆయా ప్రాంతాలకు వెళ్లగానే స్పీడ్‌ తగ్గించి నడపడం, ఆ తర్వాత పెంచడం చేసేవారు. పోలీసులు దీనిని పసిగట్టి రూటు మార్చారు. రోజూ స్పీడ్‌ గన్‌లను ఒకే చోట ఉంచకుండా ప్రదేశాలు మార్చుతున్నారు. దీంతో అతివేగంగా వెళ్లేవారు దొరికిపోతున్నారు. జరిమానాలు కట్టాల్సి వస్తుండడంతో వేగాన్ని తగ్గించడమే మేలని చాలామంది పరిమిత వేగంతోనే వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలూ తగ్గుతున్నాయి. జాతీయ రహదారిపై ఇటీవలి కాలంలో ప్రమాదాలు తగ్గడానికి స్పీడ్‌ గన్‌లే కారణమని పోలీసులు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు