ఉత్తమ్‌కు మంత్రి జగదీష్‌ సవాల్..

19 Oct, 2019 18:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డిలు తోడు దొంగలుని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ పద్మావతికి హుజూర్‌నగర్‌ టికెట్ ఇవ్వొద్దన్న రేవంత్‌ను ప్రచారానికి దింపి, ఉత్తమ్ తన దివాళా కోరుతనాన్ని చాటుకున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటుకు నోటు కేసులో యాభై లక్షల రూపాయాలతో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే.. ఉత్తమ్ కారులో మూడు కోట్ల రూపాయలు అగ్నికి ఆహుతయ్యాయని గుర్తు చేశారు. ఈ ఇద్దరు దొంగలు కలసి హుజూర్‌నగర్‌ నియోజకవర్గంపై దాడికి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. 

ఉత్తమ్‌కు సవాల్ విసిరిన మంత్రి జగదీష్‌ రెడ్డి 
సూర్యాపేట అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఉత్తమ్‌కు మంత్రి జగదీష్‌ రెడ్డి సవాల్ విసిరారు. సమయం, స్థలం తాను చెప్పినా లేదా.. తనని చెప్పమన్నా సరే సిద్ధమన్నారు. అది హుజూర్‌నగర్‌ సెంటరా.. సూర్యాపేట సెంటరా అన్నది తేల్చుకోవాల్సింది ఉత్తమ్‌కుమార్‌ రెడ్డినే అని వ్యాఖ్యానించారు. శాసన సభ్యుడిగా తన ఐదేళ్ల కాలంలో సూర్యపేటలో జరిగిన అభివృద్ధి గురించి ఉత్తమ్‌ తెలుసుకోవాలన్నారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి 20 ఏళ్లు శాసన సభ్యుడిగా, మంత్రిగా అధికారంలో ఉండి చేసిందేంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి అభివృద్ధి చేయడం ఎలానో తెలియదనే.. కోదాడ ప్రజలు ఇంటికి పంపారని ఘాటుగా విమర్శించారు. హుజూర్‌ నగర్‌ నియోజకవర్గ ప్రజలకు జ్ఞాపకశక్తి ఎక్కువ అని, ఉత్తమ్‌, రేవంత్‌రెడ్డి అరాచకాలను ఎప్పటికీ మరచిపోరన్నారు. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు