కరోనాతో మృతి చెందితే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

30 Apr, 2020 12:33 IST|Sakshi

విపక్ష నేతల డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో​ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో విపక్ష నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం ఇచ్చిన 15 వందల రూపాయలు సరిపోవుని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 12 కేజీల దొడ్డు బియ్యం కాకుండా నాణ్యమైన బియ్యం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

అకాల వర్షాలతో తడిసిన ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తరుగు పేరుతో రైతుల నుంచి ఎక్కువ ధాన్యం తీసుకుంటున్నారని  ఉత్తమ్‌ ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 80 వేల మందికి కరోనా పరీక్షలు చేస్తే.. తెలంగాణలో ఎందుకు పరీక్షలు చేయడం లేదని ప్రశ్నించారు. కాగా పేదలకు పంచేందుకు కందిపప్పు కేంద్రం నుంచి రాగానే పంపిణీ చేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు ఉత్తమ్‌ చెప్పారు. సీఎస్‌తో భేటీ అయిన వారిలో ఉత్తమ్‌తో పాటు, చాడ వెంకట్‌రెడ్డి, కోదండరామ్‌, తదితరులు ఉన్నారు.


 

మరిన్ని వార్తలు