రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం

5 Apr, 2019 08:23 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

కాంగ్రెస్‌ నల్లగొండ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, పెన్‌పహాడ్‌(సూర్యాపేట) : ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమని నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డిలతో కలిసి పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి ఓటర్లను డబ్బు సంచులతో కొనుగోలు చేసి గెలవాలని కలలు కంటున్నారన్నారు.  

దేశంలో బడుగు, బలహీన వర్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్‌ పార్టీద్వారానే సాధ్యమవుతుందన్నారు.కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కార్పొరేట్‌ వ్యక్తులకు లబ్ధిచేకూరే విధంగా చట్టాలు తీసుకొచ్చి వారిని కుబేరులుగా మార్చాడని ఆయన ఆరోపించారు. దేశ అభివృద్ధి కోసం రాహుల్‌ గాంధీ ప్రధాని కావాల్సినఅవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. తనను పార్లమెంట్‌ సభ్యుడిగా గెలిపించినట్లయితే కేంద్రంలో ఏర్పడే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మండలంలో సాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం రాయిచెరువును రిజర్వాయర్‌గా మార్చడంతోపాటు లిప్టుల నిర్మాణం చేపడుతామని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో 16స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించాలని కోరుతున్న కేసీఆర్‌ కేంద్రంలో ప్రధాన మంత్రి ఎవరో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. మోదీ, కేసీఆర్‌లు రహస్య ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీపై అక్కసు వెల్లగక్కుతున్నారని తెలిపారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాల పేరుతో దోచుకున్న సొమ్మును రాహుల్‌ గాంధీ ప్రధాని అయిన తరువాత కక్కిస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, టీపీసీసీ కార్యదర్శి తూముల భుజంగరావు, కొప్పుల వేణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పిన్నెని కోటేశ్వర్‌రావు, నాయకులు తండు శ్రీనివాస్‌యాదవ్, తూముల సురేష్‌రావు, బచ్చుపల్లి నాగేశ్వర్‌రావు, నాతాల జానకిరాంరెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు, బెల్లకొండ శ్రీరాములు, మండలి జ్యోతి, రామినేని పుష్పావతి, పొనుగోటి నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు