అమెరికా నుంచి వచ్చింది దోచుకోవడానికే..

15 Mar, 2017 02:00 IST|Sakshi
అమెరికా నుంచి వచ్చింది దోచుకోవడానికే..

రాహుల్‌పై మాట్లాడే స్థాయి ఆయనకు లేదు: కేటీఆర్‌పై ఉత్తమ్‌ ఫైర్‌
హరీశ్‌వన్నీ అవగాహన లేని మాటలు
టీఆర్‌ఎస్‌ సర్కారు చెబుతున్న గొప్పలన్నీ అవాస్తవాలే
రాష్ట్రం అప్పుల్లో నంబర్‌ వన్‌ అవుతోంది
అబద్ధాలు, అంకెల గారడీతోనే బడ్జెట్‌ ఉందని విమర్శ  


సాక్షి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణను దోచుకోవ డానికి అమెరికా నుంచి వచ్చింది మంత్రి కేటీఆర్‌. దేశం కోసం ప్రాణాలను అర్పించిన నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌గాంధీల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌ గాంధీపై విమర్శలు చేసే స్థాయి కేటీఆర్‌దా? దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాన్ని గురించి మాట్లాడే స్థాయి తెలంగాణను దోచుకుంటు న్న చరిత్ర ఉన్న కేటీఆర్‌ కుటుంబానికి లేదు. దోచుకోవడంలో తప్ప త్యాగాలలో ఆయన ఓ బచ్చా..’’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

అభివృద్ధి రేటు లో, పారిశ్రామికాభివృద్ధిలో నంబర్‌వన్‌గా ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని... కానీ పార్టీ ఫిరాయింపుల్లో, మద్యం అమ్మకాల్లో, అబద్ధాలతో ప్రజలను మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌ నంబర్‌ వన్‌గా ఉన్నారని విమ ర్శించారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రూ.69 వేల కోట్లు అప్పు ఉంటే, కేవలం రెండున్నరేళ్లలో రూ.లక్షా 40 వేల కోట్లకు పెరిగిందని.. అప్పుల్లో తెలంగాణ ఇప్పుడు నంబర్‌వన్‌ అవుతోందని వ్యాఖ్యానించారు.

ఆ గొప్పలన్నీ అవాస్తవాలే..
తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి ఉన్న ఆహార ఉత్పత్తులు ఇప్పుడు సగానికి పడిపోయినట్టు సామాజిక ఆర్థిక సర్వేనే స్పష్టం చేస్తోందని ఉత్తమ్‌ చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె స్‌పై ప్రభుత్వం చెబుతున్న గొప్పలన్నీ అవాస్త వాలేనని విమర్శించారు. పెట్టుబడులు ఆకర్షి స్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఆరో స్థానంలో ఉందని.. ప్రలోభాలతో అవార్డులు తెచ్చు కుంటే ముందున్నట్టు కాదన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయలేదన్నారు. ముస్లింల కు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు బయటపడటానికి బీసీలకు తాయిలాలు ప్రకటిస్తున్నారన్నారు. హైదరా బాద్, వరం గల్, ఆదిలాబాద్‌ల్లో ఇళ్లు కట్టిస్తామంటూ జర్నలిస్టులకు ఇచ్చిన హామీ ఎటుపోయిందని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

హరీశ్‌వి అవగాహన లేని మాటలు..
జీడీపీ విషయంలో మంత్రి హరీశ్‌రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. ఎమ్మెల్యే కాకుండానే 2004లో మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావుకు మాటలతో బెదిరించడం తప్ప అధ్యయనం చేసే అలవాటు లేనట్టుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అంకెల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం జీడీపీని నిర్ధారిస్తుందన్నారు. కాగ్‌ వెబ్‌సైట్‌ నుంచి తీసుకున్న అంకెలను బట్టి చూస్తే... రాష్ట్రం రూ.94 వేల కోట్ల ఆదాయముందని కేంద్రానికి లెక్కలు పంపిందని, కానీ వాస్తవంగా వచ్చింది రూ.72 వేల కోట్లేనని వివరించారు. అభివృద్ధిని ఎక్కువగా చూపించడానికి కేంద్రానికి తప్పుడు అంకెలు పంపించారని ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు