వారసత్వ ఉద్యోగాలంటూ మోసం

1 Apr, 2017 02:31 IST|Sakshi
వారసత్వ ఉద్యోగాలంటూ మోసం

సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ధ్వజం
చెల్లని జీఓ జారీ చేయడమే కాకుండా కోర్టులో కేసు వేయించారు
ఆ నిందను మాపై మోపి రాజకీయ లబ్ధికి ప్రయత్నించారు
చిత్తశుద్ధి ఉంటే సింగరేణి కార్మికులకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
 

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలిస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడేళ్ల తర్వాత చెల్లని జీఓ ఇవ్వడమే కాకుండా కోర్టులో కేసు వేయించి కార్మికులను మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. అబద్ధాలు, మోసమే టీఆర్‌ఎస్‌ విధానమని మండిప డ్డారు. ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌.సి. కుంతియాతో కలసి శుక్రవారం గాంధీభవన్‌ లో ఉత్తమ్‌ సమావేశమయ్యారు. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాల విషయం లో టీఆర్‌ఎస్‌ చేసిన మోసం, కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణపై ద్రోహం, సింగరేణి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం వంటి వాటిపై చర్చించారు.

శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ,  సింగరేణి కార్మికుల సమస్యలపై అధ్యయన కమిటీ చైర్మన్‌ గండ్ర వెంకట రమణారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాల విషయంలో కేసీఆర్‌ చిత్తశుద్ధితో పనిచేస్తే టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న వారితోనే కోర్టులో కేసును ఎందుకు వేయించారని ప్రశ్నించారు. ఈ జీఓ చెల్లదని కేసీఆర్‌కు తెలిసినా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని, తద్వారా వారసత్వ ఉద్యోగాలకు అర్హులైన 16 వేల మందిని కేసీఆర్‌ మోసం చేశారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ నేతలను కోర్టుకు పంపి ఆ నిందను కాంగ్రెస్‌పై మోపి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలని ఉమాండ్‌ చేశారు.

ఇచ్చిన హామీకీ దిక్కులేదు...
సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. ప్రస్తుతం అందులో ఒక్క కాంట్రాక్టు కార్మికుడూ లేరని బుకాయిస్తున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులున్నారని చెప్పారు.  అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టిస్తామన్న హామీకీ మూడేళ్లుగా దిక్కులేద న్నారు. ఓపెన్‌కాస్టు గనులను మూసేయిస్తా మని చెప్పి కొత్తగా 16 ఓపెన్‌కాస్టు గనులకు అనుమతిచ్చారని విమర్శించారు.

మరిన్ని వార్తలు