నీలాంటోళ్ల అంతు చూస్తాం..

29 Dec, 2019 02:43 IST|Sakshi

హైదరాబాద్‌ సీపీపై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ధ్వజం

సోమవారం గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌పై టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంజనీ కుమార్‌ ఐపీఎస్‌గా విధులు నిర్వర్తించడానికి పనికిరాడని, అవినీతిపరుడని, వ్యక్తిత్వం లేనివాడని, దిగజారినోడని విమర్శించారు. నీలాంటి ఓవరాక్షన్‌ చేసే వాళ్ల అంతు చూస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. శనివారం గాందీభవన్‌లో జరిగిన ‘సత్యా గ్రహ దీక్ష’సందర్భంగా జరిగిన పరిణామాలు, పోలీసుల వైఖరిపై ఉత్తమ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజనీ కుమార్‌పై ఫైర్‌ అయ్యారు. ‘నిన్న, ఈ రోజు జరిగిన పరిణామాలపై నేను వ్యక్తిగతంగా, కాంగ్రెస్‌ పార్టీపరంగా ఆందోళన వ్యక్తంచేస్తున్నాం. జాతీయ పార్టీగా, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా , 135 ఏళ్ల చరిత్ర గల పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా మేం ఓ ర్యాలీ నిర్వహిస్తామని కోరితే ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కొందరు తొత్తులు అవమానకరంగా వ్యవహరిస్తూ మా ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారు.

గాందీభవన్‌లో దీక్ష జరుగుతుంటే అందులో పాల్గొనడానికి వచ్చిన వేయి మందికి పైగా కార్యకర్తలను దీక్ష జరుగుతుండగానే నిర్బంధిస్తారా? రాష్ట్ర పోలీసు అధికారులు కేసీఆర్‌కు, ఆర్‌ఎస్‌ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అంజనీ కుమార్‌ దిగజారిపోయాడు. మమ్మల్ని అవమానపర్చేలా మాట్లాడాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీకి రోడ్లు ఖాళీ చేసి అనుమతినిస్తారా? దారుస్సలాంలో ఎంఐఎం సమావేశాలు జరిగినట్టు మేం కూడా గాం«దీభవన్‌లో దీక్ష చేస్తున్నాం. వారికి అనుమతి ఇచి్చనప్పుడు మాకెందుకు ఇవ్వరు? అంజనీ కుమార్‌.. నీ సంగతి చూస్తాం. ఎక్కడి నుంచో ఉద్యోగం చేసుకోవడానికి వచ్చావు. చేసుకుని పో. నీ వైఖరిపై మేం చాలా సీరియస్‌గా ఉన్నాం. ఇలా ఓవరాక్షన్‌ చేసిన వారిని ఊరుకోం. అంతు చూస్తాం. ఐపీఎస్‌ బదులు నువ్వు కేపీఎస్‌ అని పెట్టుకో. ఇలాంటి చెంచాలు ఐపీఎస్‌లుగా పనికిరారు. అంజనీ చిట్టా తీసి సోమవారం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఆయన్ను తొలగించాలని ఫిర్యాదు చేస్తాం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ (8) కింద హైదరాబాద్‌లో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన అధికారం గవర్నర్‌కు పదేళ్లు ఉన్నందున దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరతాం’అని ఉత్తమ్‌ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.   

మరిన్ని వార్తలు