కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు

16 May, 2018 02:23 IST|Sakshi

సర్కార్‌పై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ధ్వజం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల:  అన్ని అనుమతులు పూర్తయిన తుమ్మడిహెట్టి ప్రాజెక్టును పూర్తి చేస్తే కమీషన్లు రావనే ఉద్దేశంతోనే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రజానీకాన్ని సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మడిహెట్టి ప్రాంతాన్ని కాంగ్రెస్‌ నేతలతో కలసి ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా ప్రాణహిత నదిలో నాటుపడవపై ప్రయాణించారు. అనంతరం దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు శిలాఫలకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు, ఆదిలాబాద్‌లో లక్షన్నర ఎకరాలకు నీరు అందించే బృహత్తర ప్రాజెక్టును వదిలేసి కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం మేడిగడ్డకు తీసుకెళ్లారని «విమర్శించారు.

152 మీటర్ల ఎత్తులో గ్రావిటీతో నీరు అందించే ప్రాజెక్టును వదిలేసి మేడిగడ్డకు తరలించడంలో ఆంతరార్థాన్ని జనానికి తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. గ్రావిటీతో నీటినిచ్చే రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును కాదని, లిఫ్ట్‌లతో రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించేందుకు గల కారణమేమిటని ఉత్తమ్‌ ప్రశ్నించారు. కుట్రపూరిత మనస్తత్వం, దోపిడీ విధానాలతోనే కేసీఆర్‌ కాళేశ్వరం కోసం ప్రాణహిత ఉసురు తీశారని అన్నారు.

మరిన్ని వార్తలు