అసలెందుకు ఓడిపోయాం..?

5 Jan, 2019 10:55 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ పార్టీ తొలిసారిగా సమీక్షించుకుంది. ఘోర పరాజయానికి గల కారణాలను నియోజకవర్గాల వర్గాల వారీగా విశ్లేషించుకుంది. ఏఐసీసీ నేతలు ఆర్సీ కుంతియా, శ్రీనివాస్‌ కృష్ణన్, టీపీసీసీ చీఫ్‌ ఉత్తంకుమార్‌ రెడ్డిలు శుక్రవారం హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన అభ్యర్థులతో సమావేశమయ్యారు. పార్టీ జిల్లా ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓటమికి గల కారణాలను ఏఐసీసీ నేతలు ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను, జిల్లా పార్టీ ముఖ్యనేతలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని చేసిన అభ్యర్థిత్వాల ఎంపిక ఎందుకు గెలుపు తీరాలకు చేర్చలేదు.?

కనీసం అభ్యర్థుల సంబంధిత సామాజికవర్గాల ఓట్‌లైనాయి ఎందుకు రాలేదు.? ఎవరైనా నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారా.? వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క ఎల్లారెడ్డి మినహా మిగిలిన ఎనిమిది చోట్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలైన విషయం విధితమే. అభ్యర్థిత్వాల ప్రకటన ఆలస్యం కావడం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వంటి అంశాలే  తమ ఓటమికి కారణమైనట్లు జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ఏఐసీసీ ముఖ్యనేతల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

అతితక్కువ ఓట్లతో ఓటమి పాలైన చోట్ల వీవీపీఏటీ స్లిప్పులను లెక్కించేలా న్యాయస్థానాలను ఆశ్రయించాలనే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్, ఆ పార్టీ అభ్యర్థులు తాహెర్‌బిన్‌ హందాన్, డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి, ఈరవత్రి అనీల్, సౌదాగర్‌ గంగారాం,  కాసుల బాల్‌రాజ్, డీసీసీ అధ్యక్షులు కేశవేణు, బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, ప్రేమలత అగర్వాల్‌లు హాజరయ్యారు. స్థానికంగా లేకపోవడంతో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఈ సమావేశానికి రాలేకపోయారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు