నేడు కాంగ్రెస్‌ ‘ప్రగతి భవన్‌ ముట్టడి’ 

21 Oct, 2019 03:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడి జరగనుంది. ఉదయం 10 గంటలకు టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఆందోళన వ్యూహంపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం మాజీ మంత్రి షబ్బీర్‌అలీ నివాసంలో కాంగ్రెస్‌నేతలు సమావేశమయ్యా రు. ఈ సమావేశంలో భువనగిరి, మల్కాజ్‌గిరి ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు దయాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ప్రగతి భవన్‌ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని కోరారు. కాంగ్రెస్‌ ఆందోళన నేపథ్యంలో ఆదివారం రాత్రే కాంగ్రెస్‌ కీలక నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.   

50 వేల కుటుంబాల ఆవేదన 
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలే కాకుండా వారు చేస్తున్న సమ్మెలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ఆత్మగౌరవ పోరాటం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో, సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు కీలకంగా వ్యవహరించారన్నారు.  వారి ఉద్యమంతో వచ్చిన తెలంగాణలో వారినే రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  దీంతో 50 వేల మంది కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నా యని, వారి ఆవేదన ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. 

గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలి: సీపీఐ 
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిరసనలో పాల్గొన్న సీపీఐ న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు గాయానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సమ్మెకు మద్దతుగా నిరసనలో పాల్గొన్న రంగారావు బొటన వేలు తెగడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని చాడ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఉద్యోగుల ఉసురు తగులుతుంది: నాగం 
సాక్షి, హైదరాబాద్‌: సెల్ఫ్‌ డిస్మిస్‌ పేరుతో 50 వేల మంది ఉద్యోగులను రోడ్ల మీద పడేసిన సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగుల ఉసురు తగులుతుందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఆర్టీసీలో సమ్మె చేసే పరిస్థితి రావడానికి కేసీఆరే కారణమన్నారు.  

>
మరిన్ని వార్తలు