గెలుపుతో పొంగిపోం, ఓటమితో కుంగిపోం..

26 Jan, 2020 10:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన జరుగుతోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆదివారం గాంధీభవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ మతచిచ్చు రేపుతోందని దుయ్యబట్టారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా బీజేపీ నాయకులు నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అదే పంథాలో నడుస్తున్నారని, నిరసనలకు కూడా అనుమతి ఇవ్వడం లేదన్నారు.

ఎన్నికల్లో మద్యం, డబ్బుతో గెలుస్తున్నారని, టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. బీజేపీకి లబ్ధి కలిగేలా దేశమంతటా ఎంఐఎం పోటీ చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి గెలుపోటములు కొత్తకాదని.. గెలుపుతో పొంగిపోమని, అలాగే ఓటమితో కుంగిపోమని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు అధికార దుర్వినియోగం చేశారని, విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేసి గెలిచారని వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక‍్తం చేశారు. కార్యకర్తలు ఎవరూ అధైర‍్యపడవద్దని ఆయన సూచించారు.

చదవండి:

కారు.. వన్‌సైడ్‌ వార్‌

మహబూబ్‌నగర్‌లో కారు స్పీడు తగ్గింది..

>
మరిన్ని వార్తలు