ఈనెల 24 నుంచి పీవీ శతజయంతి ఉత్సవాలు 

20 Jul, 2020 02:09 IST|Sakshi

ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న మన్మోహన్, చిదంబరం, జైరాంరమేశ్‌ 

సందేశాలు పంపనున్న సోనియా, రాహుల్, ప్రణబ్, పీవీ కుటుంబ సభ్యులు 

టీపీసీసీ పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సమావేశంలో నిర్ణయం

సాక్షి, హైదరాబాద్ ‌: ఎవరెన్ని చెప్పినా మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావు కాంగ్రెస్‌ కుటుంబానికి చెందిన వ్యక్తి అని, ఆయన శత జయంతి వేడుకలు నిర్వహించడం తమకు గర్వకారణమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఏడాది పొడవునా ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటయిన పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సమా వేశం జరిగింది.ఇందులో ఉత్తమ్‌తో పాటు మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి గీతారెడ్డి, గౌరవాధ్యక్షుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, వైస్‌ చైర్మన్, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, కన్వీనర్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క, కమిటీ సభ్యులు మల్లు రవి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, దాసోజు శ్రావణ్, బొల్లు కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో భాగంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ ఈనెల 24 నుంచి పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించనున్నట్టు చెప్పారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు గాను అదే రోజున పీవీ తన మొదటి ప్రసంగం చేశారని, అందుకే ఆ రోజు నుంచి శతజయంతి ఉత్సవాలు ప్రారంభించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈనెల 24న జూమ్‌ యాప్‌ ద్వారా 1000 మంది పాల్గొనేలా కార్యక్రమం చేపట్టాలని, ఇందిరా భవన్‌లో ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఏర్పాటు చేసి వక్తల ప్రసంగాలు వినేలా ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమా వేశానికి వక్తలుగా పీవీ సన్నిహితుడు, మాజీ ప్రధా ని మన్మోహన్‌ సింగ్, కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, జై రాం రమేష్‌లు జూమ్‌ యాప్‌ ద్వారా మాట్లాడేలా ఆహ్వానించాలని నిర్ణయించారు.

అదే విధంగా ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీలు, పీవీ కుటుంబీకులే వారి సందేశాలను వీడియో రూపంలో పంపుతారని, వాటిని కూడా ప్రదర్శించాలని ఉత్తమ్‌ చెప్పారు. ఈ సమావేశం అనంతరం ఇందిరా భవన్‌లో ఈనెల 24న జరిగే కార్యక్రమ ఏర్పాట్లను ఉత్తమ్‌ పరిశీలించారు. ఆ తర్వాత గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీవీ నరసింహారావు వంద శాతం కాంగ్రెస్‌ వాది అని అన్నారు. వంగర గ్రామం నుంచి సామాన్య కాంగ్రెస్‌ కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, దేశ ప్రధానిగా పీవీ ఎదిగారని చెప్పారు. 

మరిన్ని వార్తలు