‘కాంగ్రెస్‌ గెలిస్తే రాహులే ప్రధాని అవుతారు’

2 Mar, 2019 16:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి తీరుతుందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఒక స్థానం గెలిచే అవకాశం ఉన్నా.. టీఆర్‌ఎస్‌ పోటీకి దిగడం అక్రమాలకు తెరలేపడమే అని ఆయన విమర్శించారు. రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులుగా చల్లా నర్సింహరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడారు. ఎమ్మెల్యే కోటాలో గూడురు నారాయణ రెడ్డి, పట్టభద్రుల కోటాలో మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి తప్పక విజయం సాధిస్తారని అన్నారు.

టీఆర్‌ఎస్‌ అక్రమ పద్దతులో​ గెలవాలని ప్రయత్నిస్తోందని, అలా చేయకపోతే కాంగ్రెస్‌ విజయం ఖాయమని ఉత్తమ్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు రాహుల్‌, మోదీ మధ్యే పోటీ ఉంటుందని, టీఆర్‌ఎస్‌ ఒక్క సీటు గెలిచిన తెలంగాణకు ఏలాంటి ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ గెలిస్తే రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారనీ, తెలంగాణ అభివృద్ధి ఆకాంక్ష కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉందన్నారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు.  


 

మరిన్ని వార్తలు