‘ఎన్నికలో గెలవనివాడు కూడా మాట్లాడుతున్నాడు’

26 Dec, 2019 15:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒక్కరోజు ముందు రిజర్వేషన్లు ఇచ్చి.. రెండు రోజులు నామినేషన్‌ వెయ్యమనడం పద్ధతి ఎలా అవుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికలకు భయపడి మాట్లాడటం లేదని.. రిజర్వేషన్‌ తెలియకుండా నామినేషన్‌ ఎలా వేస్తారని ఉత్తమ్‌ తీవ్రంగా విమర్శించారు. ఒక్క ఎన్నికల్లో గెలవనివాడు కూడా తనపై మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. తాను రాష్ట్రంలో ఎక్కువ సార్లు గెలిచానని ఉత్తమ్‌ తెలిపారు. ఓటర్ల జాబితా పూర్తికాకుండా షెడ్యూల్‌  ఎలా ఇస్తారు.. ఇలా చేయటం ఎక్కడైనా ఉందా అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. రిజర్వేషన్ ప్రకటనకి నామినేషన్‌కు మధ్య సమయం ఇవ్వాలని అంటున్నాం కానీ, ఎన్నికలను వాయిదా వేయమని అనడంలేదన్నారు. పిచ్చి పిచ్చిగా మొరగకుండా.. ఎన్నికలు సరిగా నిర్వహించాలని తాము కోరుతున్నామని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉండగా బలమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న అయిదు దేశాల్లో భారత్ ఉండేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి శక్తిసింగ్‌ గోయల్‌ అన్నారు. మోదీ ఓటు బ్యాంకు రాజకీయాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్థికంగా దేశం పతనం అవుతుంటే, ప్రజల దృష్టి మళ్లించడానికే మోదీ పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలను తెరమీదకు తెచ్చారని శక్తిసింగ్‌ గోయల్‌ ధ్వజమెత్తారు. అస్సాంలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలుకు కేంద్రం సిద్ధమవుతోందని ఆయన మండిపడ్డారు. మోదీ తన డిగ్రీ చూపించడు కానీ దేశ ప్రజలు అంతా బర్త్ సర్టిఫికేట్ మాత్రం చూపించాలంటాడని శక్తిసింగ్‌ గోయల్‌ విమర్శించారు.

మరిన్ని వార్తలు