త్వరలో టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటా: ఉత్తమ్‌

31 Dec, 2019 19:51 IST|Sakshi

హుజురాబాద్‌: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి త్వరలో తప్పుకోనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న వరుస ఓటముల కారణంగానే టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడానికి ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక తాను ఆ పదవిలో కొనసాగలేనని పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేసినట్టు వార్తలు వినిపించాయి.

చదవండి: రాజకీయాలకు పనికిరానంటూ ఎమ్మెల్యే రాజీనామా!

అయితే ఇప్పటికిప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవడం వల్ల కొత్త సమస్యలు వస్తాయని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఆయననే టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరినట్టు తెలుస్తోంది.  రాజీనామా తర్వాత హుజూర్ నగర్, కోదాడ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. మరికొన్నిరోజుల్లో అధ్యక్ష పదవిని త్యజిస్తున్నానని కార్యకర్తలతో చెప్పారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కార్యకర్తలను సమాయత్తం చేశారు. కాగా, ఉత్తమ్ కుమార్ ప్రకటనపై కాంగ్రెస్ అధినాయకత్వం ఎలా స్పందిస్తున్నది ఆసక్తి కలిగిస్తోంది.

చదవండి: 'పౌరసత్వ చట్టం నచ్చని వారు సముద్రంలోకి దూకండి'

మరిన్ని వార్తలు