యురేనియం తవ్వకాలను నిలిపేయండి 

17 Aug, 2019 03:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆమ్రాబాద్‌లో యురేనియం తవ్వకాలను నిలిపేయాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ ప్రాంతం పులులకు నివాస యోగ్యమైందని, చెంచుల జీవితాలను చిన్నాభిన్నం చేయడంతోపాటు పర్యావరణాన్ని నాశనం చేసే తవ్వకాల అనుమతులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. శుక్రవారం ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఈ తవ్వవకాలతో వేలాది మంది చెంచుల కుంటుబాలు అటవీ ప్రాంతం వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వకాల వల్ల ఏర్పడే వాయు కాలుష్యంతో కేన్సర్‌ వ్యాధులు సోకడంతోపాటు జంతు జాతులు నాశనమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. మన్ననూర్, పదిర, దేవరకొండ, నాగార్జునసాగర్‌ ప్రాంతంలోని లంబాపూర్‌లో తవ్వకాలకు యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఉందని వివరించారు.  యురేనియం తవ్వకాలకు సంబంధించిన అనుమతులను వెంటనే రద్దు చేసి ఆయా ప్రాంతాల్లో నివసించే అటవీ జాతులను, పర్యావరణాన్ని కాపాడాలని లేఖలో కోరారు.  

మరిన్ని వార్తలు