కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలు

30 Sep, 2017 02:18 IST|Sakshi

ఉత్తమ్, చాడ, రేవంత్‌ ధ్వజం

‘సింగరేణి’ గెలుపు కోసం డబ్బు, మద్యం సరఫరా చేస్తున్న ప్రభుత్వం

కార్మికులకిచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చలేదని మండిపాటు

మూడేళ్లయినా వారసత్వ ఉద్యోగాలు, సొంతిళ్ల ఊసేలేదు

వారసత్వ ఉద్యోగాలపై కోర్టుకు వెళ్లినది జాగృతి కార్యకర్తేనని ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: ‘ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలు. గత ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆయన నెరవేర్చలేదు. వారసత్వ ఉద్యోగాలు, కార్మికులకు సొంతిళ్లు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి తదితర హామీలను నెరవేర్చడానికి ఈ మూడేళ్లలో ఆయన చేసిందేమీ లేదు’అని కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ, సీపీఐ విమర్శించా యి. శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీపీ ఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీడీపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

సింగరేణి బొగ్గు గనుల సంస్థ కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీల కూటమిని గెలిపించాలని సం స్థ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవ న్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘాన్ని గెలిపించడానికి డబ్బు, మద్యం, మాంసాన్ని ప్రభుత్వం విచ్చలవిడిగా సరఫరా చేస్తోం దని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు ఈ మూడున్నరేళ్లలో చేయని పనులన్నింటినీ ఇప్పుడు చేసేస్తామని సీఎం చెప్పడం కేవలం ఎన్నికల్లో గెలుపొందడానికేనని విమర్శించారు.  

ఆ కేసులతో సంబంధం లేదు: ఉత్తమ్‌
సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేతలు కోర్టులో కేసు వేయించారని కేసీఆర్‌ తప్పుడు ఆరోపణలు చేశారని ఉత్తమ్‌ మండిపడ్డారు. ఈ కేసుతో కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వారసత్వ ఉద్యోగాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ జాగృతి సంస్థ కార్యకర్త సతీశ్‌కుమార్‌ కోర్టుకు వెళ్లారని రేవంత్‌ పేర్కొన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో కేసీఆర్‌ ఓ చేత్తో జీవో ఇస్తే మరో చేత్తో ఆయన కుమార్తె, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన కార్యకర్తతో కేసు వేయించి జీవోను కొట్టివేయించారని ఆరోపించారు.

సింగరేణి కార్మికులకు సొంతిళ్లు కట్టించి ఇస్తామని 2014 ఎన్నికల్లో కేసీఆర్‌ హామీ ఇచ్చారని, తర్వాత రూ.10 లక్షల గృహ రుణాన్ని వడ్డీ లేకుండా ఇస్తామని, ఇప్పుడు రూ.6 లక్షల రుణం ఇస్తామని మరోసారి మాట మార్చారని ఉత్తమ్‌ మండిపడ్డారు. సింగరేణి సంస్థలో 41 శాతం కేంద్ర ప్రభుత్వ వాటా షేర్లను కొనుగోలు చేస్తామని కేసీఆర్‌ పేర్కొనడం ఆయన అవగాహనా రాహిత్యానికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. సహజ వనరులైన బొగ్గు గనులు కేంద్ర పరిధిలోకి వస్తాయనే విషయాన్ని సీఎం గుర్తించాలని సూచించారు.

సింగరేణి సంస్థకు చెందిన రూ.1,000 కోట్ల కార్పొరేట్‌ రెస్పాన్సిబిలిటీ ఫండ్‌ (సీఎస్‌ఆర్‌)ను సింగరేణి ప్రాంతాల్లో కాకుండా తన కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పనుల కోసం సీఎం వినియోగించారని ఆరోపించారు.  


అంశాల వారీగా ఐక్యత
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు అంశాల వారీగా కలసి పని చేస్తాయని చాడ పేర్కొన్నారు. సింగరేణి ఎన్నికల్లో కలసి పని చేస్తున్న ఈ మూడు మార్టీలు సాధారణ ఎన్నికల్లోనూ ఐక్యతను కొనసాగిస్తాయా? అని విలేకరులు ప్రశ్నించగా సమయం వచ్చినప్పుడు తెలియజేస్తామని చెప్పారు.


సగానికి తగ్గిపోయిన కార్మికులు: చాడ
గత కాంగ్రెస్‌ ప్రభుత్వం జైపూర్‌లో 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను నిర్మిస్తే.. తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ కేవలం స్విచ్‌ ఆన్‌ చేసి ప్లాంట్‌ను తానే నిర్మించానని చెప్పుకుంటున్నారని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. సింగరేణి సంస్థ గతేడాది రూ.1,450 కోట్ల లాభాలు అర్జిస్తే దాన్ని రూ.395 కోట్లకు తగ్గించి చూపించి కార్మికుల వాటాను ఎగ్గొట్టిందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.

గతంలో సింగరేణిలో లక్షా 10 వేలకు పైగా కార్మికులు పనిచేసే వారని, ఇప్పుడు 52 వేలకు తగ్గిపోయారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక 11 వేల మంది కార్మికులు పదవీవిరమణ చేస్తే ఆ పోస్టులను కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. కారుణ్య నియామకాల పద్ధతిలో వారసత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమలుకు సాధ్యం కాదని, చట్టాలు అంగీకరించవని రేవంత్‌ స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణ, టీడీపీ నేత పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు