కేసీఆర్‌ మాట నిలబెట్టుకో..

8 Aug, 2017 04:00 IST|Sakshi
కేసీఆర్‌ మాట నిలబెట్టుకో..
పొన్నం దీక్షచేస్తే పోలీసులతో బెదిరిస్తావా..?
- ఇసుకాసురుల కోసం దళితులపై దౌర్జన్యాలు చేస్తావా?
తెలంగాణ బిల్లు కోసం కృషి చేసిన మీరాకుమార్‌ను అవమానిస్తావా?
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం
 
సాక్షి, కరీంనగర్‌: ‘కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పటమే కాకుండా.. వైద్యకళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆమరణ దీక్ష చేపడితే అనుమతులు ఇవ్వకుండా పోలీసులతో బెదిరిస్తావా..? సన్నాసి కేసీఆర్‌.. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో..’అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మెడికల్‌ కళాశాల సాధన కోసం మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌కు సంఘీభావం తెలిపేందుకు సోమవారం కరీంనగర్‌ వచ్చిన ఆయన దీక్షా శిబిరంలో మాట్లాడారు.

తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్‌లో ఎన్ని అవాంతరాలొచ్చినా తనదైన శైలిలో నిలబడి సాధించిన వ్యక్తి పొన్నం అని కొనియాడారు. ఇసుకాసురుల కోసం దళితులపై దాడులు, దౌర్జన్యాలు చేయడమే కాకుండా పోలీసులను ఉసిగొల్పి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించేలా చేసిన నీచ సంస్కృతి కేసీఆర్‌దే అన్నారు. ‘2009 డిసెంబర్‌లో రాష్ట్ర సాధన కోసం నీవు దీక్ష చేసినప్పుడు నీ కూతురు కవిత అప్పటి లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌కు అర్ధరాత్రి ఫోన్‌చేసి నా తండ్రి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, రక్షించాలని వేడుకున్నారని, వెంటనే మీరాకుమార్‌ పార్టీ అధిష్టానంతో మాట్లాడి చిదంబరంతో ప్రకటన చేయించి నిన్ను కాపాడిన గొప్ప వ్యక్తని అవమానిస్తావా..?’ ఉత్తమ్‌ పేర్కొన్నారు.

తెలంగాణ బిల్లుకు అండగా నిలబడి బిల్లు పాస్‌ చేయించిన మీరాకుమార్‌ నేరెళ్ల బాధితులను పరామర్శించేందుకు ఢిల్లీ నుంచి ఇక్కడకు వస్తే ఆమెను స్వాగతించాల్సింది పోయి పిచ్చికూతలతో అవవమానిస్తావా..? అని విమర్శించారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనని, కేసీఆర్‌ ఇచ్చినా.. ఇవ్వకున్నా మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేసి తీరుతామని తెలిపారు.  డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీమంత్రి రాంచంద్రారెడ్డి, ఓబీసీ సెల్‌ రాష్ట్ర చైర్మన్‌ చిత్తరంజన్‌దాస్, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు. 
 
ఇతర కాంగ్రెస్‌ నేతల ధ్వజం
పూటకో మాట మాట్లాడుతూ అబద్దాలతో కాలం వెల్లదీస్తూ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ ఊసరవెళ్లిలా తయారయ్యారని శాసనమండలి పక్షనేత షబ్బీర్‌అలీ అన్నారు. పొన్నంకు మెడికల్‌ కళాశాల ఇప్పుడు గుర్తొచ్చిందా..? అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. పొన్నం దీక్షతో కరీంనగర్‌ కాంగ్రెస్‌ సునామీగా మారిందని, ఈ సునామీలో కేసీఆర్‌ రాచరికపు, ప్రజాస్వామ్య వ్యతిరేకపాలన కొట్టుకుపోతుందని మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. పొన్నం దీక్షను భగ్నం చేయడానికి టీఆర్‌ఎస్‌ నాయకులు, పోలీసులతో కుట్ర పన్నుతున్నారని, మెడికల్‌ కళాశాలపై ప్రకటన వెలువడేవరకూ పొన్నం దీక్ష విరమింపజేసే ధైర్యం ఎవరికీ లేదని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి హెచ్చరించారు. 
మరిన్ని వార్తలు