ఊ.. రాయండి

15 Apr, 2020 07:46 IST|Sakshi

తపోవనంలో ఉన్నవాళ్లు చెట్టు కింది అరుగులా ఒక చోట ఉండిపోవాలి. ఉడతల్లా అటూఇటూ గంతులేస్తామంటే కుదరదు. పైగా ఇప్పుడు లాక్‌డౌన్‌ కూడా. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌కి కొంతమంది విదేశీయులు వచ్చారు. లెక్క చూస్తే పది మంది వరకు ఉన్నారు. ఆడవాళ్లున్నారు. మగవాళ్లున్నారు. రిషికేష్‌ నుంచి తపోవనం ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి వెళ్లారు. వెళ్లినవాళ్లు మునుల్లా ఎవరికివారు ఉండాల్సింది పోయి, ఒకరిమీద ఒకరు పడుతూ లేస్తూ విహరిస్తున్నారు. పోలీసులొచ్చి ‘అలా దగ్గర దగ్గరగా ఉండకండి. లాక్‌డౌన్‌ అయ్యాక మీ ఇష్టమండీ’ అన్నారు. వాళ్లు సరే అన్నారు. వీళ్లు అలా రౌండ్‌ కొట్టి వచ్చేసరికి మళ్లీ నవ్వుతూ, తుళ్లుతూ కిందామీదా పడుతూ ఉన్నారు. ఇలా కాదని ఒక్కొక్కరి చేతా 500 సార్లు ‘ఐ డిడ్‌ నాట్‌ ఫాలో ది రూల్స్‌ ఆఫ్‌ లాక్‌డౌన్‌ సో ఐ యామ్‌ సో సారీ’ అని ఇంపోజిషన్‌ రాయించారు. దాన్ని కూడా వాళ్లు ఎంజాయ్‌ చేస్తూ రాశారు. మనసు ఉల్లాసంగా ఉండే మనిషిని ఎంతసేపని ఆపగలం?

మరిన్ని వార్తలు