యమ డేంజర్‌..యూవీ

29 May, 2020 10:13 IST|Sakshi
పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫ్యాన్‌ ఏర్పాటు చేసిన దృశ్యం

నగరంలో 11 పాయింట్లుగా రికార్డు

ఒక్కసారిగా పెరిగిన విద్యుత్‌ వినియోగం

నీడలో ఉన్నా తప్పని మంట, వేడిగాలులు

ఏసీ, కూలర్లు వద్దనుకున్నా తప్పని వైనం

రికార్డ్‌ స్థాయిలో 68 ఎంయూలకు చేరిన వినియోగం

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గత నాలుగైదు రోజులుగా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. వాతావరణంలో ఆల్ట్రా వయోలెట్‌ (యూవీ) రేడియేషన్‌ తీవ్రత ఎనిమిది పాయింట్లు ఉండగాల్సి ఉండగా, తాజాగా 11 పాయింట్లుగా రికార్డు అవుతుంది. ఫలితంగా నీడలో ఉన్నా మంట, వేడిగాలులు తప్పడం లేదు. ఉక్కపోతకు తోడు..వేడిగాలుల నుంచి ఉపశమనం కోసం సిటిజన్లు ఇష్టం లేకపోయినా ఏసీ, కూలర్లను వినియోగించాల్సి వస్తుంది. కరోనా భయంతో గత కొంతకాలంగా వీటి వినియోగానికి దూరంగా ఉన్న వినియోగదారులు ప్రస్తుతం వీటి కొనుగోలుకు పోటీ పడుతున్నారు. రోజంతా వాటిని వినియోగిస్తుండటంతో విద్యుత్‌ వినియోగం రికార్డు స్థాయిలో నమోదువుతుంది. తాజాగా బుధవారం 68 ఎంయూలు నమోదైంది. ఈ ఏడాది.. ఈ సీజన్‌లో ఇదో రికార్డు. పగటి ఉష్ణోగ్రతలకు తోడు కరెంట్‌ వినియోగం అనూహ్యంగా పెరగడంతో సబ్‌స్టేషన్లలోని పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. హైఓల్టేజీ సమస్యతో ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం కోసం ఆయా పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు ఫ్యాన్లు ఏర్పాటు చేయడం విశేషం.

♦ రికార్డు స్థాయిలో వినియోగం...
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 55 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో 48 లక్షలకుపైగా గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఏడు లక్షల వరకు వాణిజ్య కనెక్షన్లు ఉండగా, చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మరో 50 వేల వరకు ఉన్నాయి. లక్షకు పైగా వీధి దీపాల కనెక్షన్లు ఉన్నాయి. హోటళ్లు, సినిమా హాళ్లు, భారీ మాల్స్‌ ఇంకా తెరుచుకోకపోయినా విద్యుత్‌ వినియోగం మాత్రం భారీగా నమోదవుతుంది. నిజానికి శీతల గాలుల్లో కరోనా వైరస్‌ బలపడే ప్రమాదం ఉందని భావించిన గ్రేటర్‌ వాసులు భయంతో గత రెండు నెలలుగా ఏసీలు, కూలర్లకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వడగాల్పులు వీస్తుండటంతో ఇష్టం లేక పోయినా ఏసీలు, కూలర్లను ఆన్‌ చేశారు. ఫలితంగా గత నాలుగైదు రోజులుగా నగరంలో విద్యుత్‌ వినియోగం ఫీక్‌ స్టేజ్‌కి చేరుకుంటుంది. నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈసారి వినియోగం తక్కువే అయినప్పటికీ...మార్చి, ఏప్రిల్‌ నెల రోజువారి సగటు వినియోగంతో పోలిస్తే...లాక్‌డౌన్‌ స డలింపు తర్వాత వినియోగం క్రమంగా పెరగడం విశేషం. మే మొదటి వారంలో గ్రేటర్‌లో రోజువారి సగటు వినియోగం 54 ఎంయూలు ఉండగా...ప్రస్తుతం 68 ఎంయూలకు చేరుకోవడం గమనార్హం.

వెంటాడుతున్న నిర్వహణ లోపం....
వేసవికి ముందే లైన్లకు అడ్డుగా ఉన్న కొమ్మలు తొలగించడం, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో తలెత్తే ఆయిల్‌ లీకేజీలను అరికట్టడం, ఫీడర్లలో ఎర్తింగ్‌ సమస్య లేకుండా చూడటం వంటి పునరుద్ధరణ పనులు నిర్వహించాల్సి ఉంది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఇందుకు ఏటా వంద కోట్లుకు పైగా ఖర్చు చేస్తుంది. నిర్వహణ లోపానికి అధికారుల నిర్లక్ష్యం తోడవడంతో హై ఓల్టేజీ సమస్య తలెత్తినప్పుడు సబ్‌స్టేషన్లలోని ట్రాన్స్‌ఫార్మర్లలో మంటలు తలెత్తి కాలిపోయే ప్రమాదం ఉంది. తాజాగా నల్లగొండ జిల్లా కామినేని ఆస్పత్రి సమీపంలోని 220 కేవీ సబ్‌స్టేషన్‌లో తలెత్తిన విద్యుత్‌ ప్రమాదానికి ఇదే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. జూన్‌ మొదటి వారంలో గాలివానతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. లూజ్‌ కాంటాక్ట్‌లు, వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించక పోవడంతో షార్ట్‌ సర్క్యూట్‌తో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదు. అంతేకాదు ప్రస్తుతం నగరంలోని అనేక ట్రాన్స్‌ఫార్మర్లలో ఆయిల్‌ లీకేజీ తదితర సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటిని సరి చేయక పోవడం వల్ల వాటిలో మంటలు వచ్చి కాలిపో యే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా