'కేసీఆర్.. నీ కొడుకుకు నీతులు చెప్పు'

29 Mar, 2017 18:44 IST|Sakshi
'కేసీఆర్.. నీ కొడుకుకు నీతులు చెప్పు'

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులకు సీఎం కేసీఆర్‌ చెబుతున్న నీతులేవో తన కుమారుడు కేటీఆర్‌కు చెబితే బాగుంటుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) వ్యాఖ్యానించారు. మంత్రులు, ఇతర నేతలు అధికారాన్ని తలకెక్కించుకోవద్దని నీతులు చెబుతున్న కేసీఆర్‌.. దానిని ముందు ఆయన కుమారుడు కేటీఆర్ పాటించేలా చూడాలన్నారు. మీడియాతో బుధవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం కుమారుడు, మంత్రి అయినంత మాత్రాన కేటీఆర్‌ ఏమైనా మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయిం‍ట్‌ వద్ద విలేకరులతో మాట్లాడినంత మాత్రాన తనపై కేసులు పెడతారా అని, తాను చేసిన పాపమేమిటో చెప్పాలన్నారు.  

కాంగ్రెస్‌ పార్టీ నేతలను తరమికొట్టాలని చెప్పడం సబబు కాదన్నారు. బీసీలకు కొత్త కమిషన్ కోసం తాను 2005 నుంచి పోరాడుతున్నానని.. క్రిమీలేయర్ వల్లనే బీసీలు నష్టపోతున్నారని, దానిని తొలగిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సన్నిహితుడని, ఆయన చొరవ తీసుకుని క్రిమీలేయర్‌ను ఎత్తివేయించాలన్నారు.

అసెంబ్లీ స్పీకర్‌ ఎస్‌.మధుసూదనాచారితో వీహెచ్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడకుండా పోలీసులు తనను అడ్డుకోవడం, ఆ తర్వాత దారితీసిన పరిణామాల గురించి ఆయన వివరణన ఇచ్చారు. సీనియర్‌ నాయకుడిగా, మాజీ ఎంపీగా తనతో అమర్యాదకరంగా ప్రవర్తించారని వీహెచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పీకర్‌ ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు