మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ–హబ్‌’

1 Dec, 2017 02:15 IST|Sakshi

వారికోసం ప్రత్యేక ఇంక్యుబేటర్‌ ఏర్పాటు చేస్తాం

జీఈఎస్‌ ముగింపు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌

మహిళల పరిశ్రమల్లో ప్రభుత్వ పెట్టుబడుల కోసం రూ.15 కోట్లతో ‘టీ–ఫండ్‌’

వారి పరిశ్రమల నుంచి తప్పనిసరి కొనుగోలు నిబంధన తెస్తామని వెల్లడి

ప్రపంచానికి మరో సిలికాన్‌ వ్యాలీ హైదరాబాద్‌: నీతి ఆయోగ్‌ సీఈవో

సదస్సుతో స్టార్టప్‌లు, కొత్త ఆవిష్కరణలకు ఊపు వస్తుందని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ–హబ్‌’ పేరుతో స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ‘విమెన్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ (డబ్ల్యూఈ)–హబ్‌ (వీ–హబ్‌)’గా దీనిని పిలుస్తామని చెప్పారు. దీంతోపాటు మహిళా పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులు పెట్టేందుకు రూ.15 కోట్లతో ‘టీ–ఫండ్‌’ పేరిట కార్పస్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నిధుల నుంచి ఒక్కో పరిశ్రమలో రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు పెట్టుబడులు పెడతామన్నారు. ఇక ప్రభుత్వం జరిపే కొనుగోళ్లలో 20 శాతం వస్తువులను సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల(ఎస్‌ఎంఈ) నుంచి కొనుగోలు చేయాలన్న నిబంధన ఉందని.. ఈ 20 శాతంలో కనీసం నాలుగో వంతు వస్తువులను తప్పనిసరిగా మహిళల పరిశ్రమల నుంచే సేకరించాలన్న నిబంధన తీసుకొస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా మూడు పారిశ్రామికవాడలు ఉన్నాయని.. మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో పెట్టుబడి రాయితీలు, ప్రోత్సహకాలు అందిస్తోందని చెప్పారు. వారికి మరింత చేయూత అందించాలనే తాజా నిర్ణయాలను తీసుకున్నామని పేర్కొన్నారు. గురువారం జీఈఎస్‌ సదస్సు ముగింపు సందర్భంగా నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌లతో కలసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

టీ–హబ్‌ తరహాలోనే..
జీఈఎస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె, సలహాదారు ఇవాంకా తదితరులు టీ–హబ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారని కేటీఆర్‌ గుర్తుచేశారు. టీ–హబ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యూబేటర్‌గా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్‌ కూడా ప్రకటించారని.. అదే విధంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘వీ–హబ్‌’ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమెరికా వంటి దేశాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వాలు నిధులు సహాయం చేయాల్సిన అవసరం ఉండదని.. భారత్‌లో మాత్రం పరిస్థితులు వేరని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జీఈఎస్‌కు 140 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారని... తనతో మాట్లాడిన వారంతా సదస్సు ఏర్పాట్లు, చర్చాగోష్ఠులు చాలా బాగున్నాయని ప్రశంసించారని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన జీఈఎస్‌ సదస్సుల్లో అత్యంత విజయవంతమైన సదస్సు ఇదేనని పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ, ఇవాంకాలతో పాటు సదస్సు నిర్వహణకు సహకరించిన నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సు ద్వారా అమెరికా–భారత్‌ల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

స్టార్టప్‌లతోనే కొత్త ఉద్యోగాలు
ఫోర్బ్స్‌ జాబితాలోని భారీ పరిశ్రమలు ఇకముందు అదనంగా కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాయని తాను అనుకోవడం లేదని... కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ద్వారానే కొత్త ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్‌ చెప్పారు. జీఈఎస్‌ సదస్సు ద్వారా ఔత్సాహిక, యువ పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రాధాన్యతాంశాలుగా తీసుకుంటోందని చెప్పారు. భారత దేశమంటే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై అనే నాలుగు మెట్రో నగరాలే కాదని.. వాటి వెలుపల హైదరాబాద్‌ వంటి అందమైన భారతదేశం ఉందని ప్రకటించారు. జీఈఎస్‌ వంటి ఎన్నో కార్యక్రమాలను హైదరాబాద్‌ నిర్వహించగలదన్నారు. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా’ప్రచారోద్యమం వెనుక కీలకంగా ఉన్న అమితాబ్‌కాంత్‌.. హైదరాబాద్‌లో పర్యాటకానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారని చెప్పారు.

మరో సిలికాన్‌ వ్యాలీ హైదరాబాద్‌
ప్రపంచానికి హైదరాబాద్‌ నగరం మరో సిలికాన్‌ వ్యాలీ అని జీఈఎస్‌ సదస్సు చాటిచెప్పిందని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ ప్రశంసించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణతో పాటు భారత్‌లో కొత్త పరిశ్రమల స్థాపన, స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ఊపు వస్తుందని చెప్పారు. స్టార్టప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా లాంటి కార్యక్రమాలు మరింత పుంజుకుంటాయన్నారు. గురువారమే దేశ జీడీపీ గణాంకాలు విడుదలయ్యాయని.. గత త్రైమాసికంలో దేశం 6.3 శాతం వృద్ధి సాధించడం శుభ సూచకమని పేర్కొన్నారు. గతేడాది ఇదే సమయంలో వృద్ధిరేటు 5.7 శాతమేనని.. దేశం తిరిగి వృద్ధి బాటలో పయనిస్తోందని గణాంకాలు సూచిస్తున్నాయని అమితాబ్‌కాంత్‌ చెప్పారు. దక్షిణాసియాలో తొలిసారిగా నిర్వహించిన జీఈఎస్‌కు సహకరించిన అమెరికా, తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ, ఇవాంకా, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్‌లతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు.


జీఈఎస్‌ ముగింపు సెషన్‌లో యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ క్యాథరీన్‌ హడ్డా, కేటీఆర్, జయేశ్‌ రంజన్‌ తదితరులు

మరిన్ని వార్తలు