తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డి!

25 Oct, 2014 02:14 IST|Sakshi
తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డి!
  • సీఎస్‌గా నియమించాలని మొదట్లో యోచించిన సీఎం కేసీఆర్
  •   ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా లేకపోవడంతో పునరాలోచన
  •   ప్రస్తుతం ఆర్థిక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు
  •  
     సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా వి.నాగిరెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నాగిరెడ్డి.. వచ్చే ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఎన్నికల కమిషనర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తర్వాత ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో.. కమిషనర్‌ను నియమించాల్సి ఉంది. అలాగే పలు కారణాలవల్ల పోలింగ్ ఆగిపోయినా, ఖాళీ అయిన స్థానాలకూ ఎన్నికలు నిర్వహించాలి. కమిషనర్‌ను నియమించకపోతే.. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కమిషనర్‌ను నియమించాలని సర్కారు భావిస్తోంది.
     
     సమావేశాల తర్వాత ఐఏఎస్‌కు రాజీనామా..
     టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. తెలంగాణ, అందులోనూ మెదక్ జిల్లాకు చెందిన నాగిరెడ్డికి కీలక పదవి అప్పగించాలని సీఎం కేసీఆర్ మొదట్లోనే నిర్ణయించారు. ఒక దశలో ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా లేకపోవడం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు మాత్రమే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. నాగిరెడ్డి 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన కంటే ముందు బ్యాచ్ (1983 వారికి) అధికారులకు కూడా ఇంకా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు లభించలేదు. వచ్చే సంవత్సరం మొదట్లో 1983 బ్యాచ్ అధికారులందరికీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఈ లెక్కన వచ్చే ఏడాది కూడా నాగిరెడ్డికి పదోన్నతి లభించే అవకాశం లేకపోవడంతో.. ఆయన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగానే త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిసింది. నవంబర్ 5 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు పూర్తయ్యాకఐఏఎస్ పదవికి నాగిరెడ్డి రాజీనామా చేసి, ఆ వెంటనే ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యలు స్వీకరించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
     
     కొందరిని ఇక్కడే ఉంచండి
     ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులను ఇక్కడే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య తదితరులను ఇక్కడే ఉంచాలని తెలంగాణ సర్కారు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
     
మరిన్ని వార్తలు