సేవకు కాదేది అనర్హం..

25 Feb, 2020 09:48 IST|Sakshi

ప్రతి మంగళవారం అనాథలకు సేవ

నడుం బిగించిన సిటీ హెయిర్‌ స్టైలిస్ట్స్‌  

సేవా గుణం ఉండాలే కానీ, సేవకు కాదేది అనర్హం అని నిరూపిస్తున్నారు సిటీకి చెందిన హెయిర్‌ స్టైలిస్ట్స్‌..తాము చేసే  వృత్తినే సేవకు అనుసంధానం చేశారు. తమ సేవల కోసం తమ దగ్గరకు రాలేని వారి దగ్గరకు తామే స్వయంగా వెళుతూ... ‘‘వి ఫర్‌ ఆర్ఫన్స్‌’’ పేరుతో సిటీలోని ఆర్ఫాన్‌హోమ్స్, వృద్ధాశ్రమాలు... వంటి చోట్లకు వెళ్లి ఉచితంగా హేర్‌ కటింగ్‌ చేస్తూ మనసుంటే సేవా మార్గాలెన్నో అని నిరూపిస్తున్నారు. 

సాక్షి, సిటీబ్యూరో: ‘‘అనాథలకు తనకు తోచిన, నిరంతరాయంగా సాగే సహయం ఏదైనా చేయాలనే తపనతో ఉండేవాడినని, అందులోంచి పుట్టిన ఆలోచనే ‘‘వి ఫర్‌ ఆర్ఫన్స్‌’’ అని అంటున్నాడు ముషీరబాద్‌లో సెలూన్‌ని నిర్వహించే రాజేష్‌. 2018 నుంచి ఈ కార్యక్రమంలో భాగంగా సిటీలోనే దాదాపు 30 వరకు అనాథ ఆశ్రమాలు,స్వచ్చంద సేవా సంస్థల్లోని పిల్లలకు, వృద్ధులకు అంతేకాకుండా అంధులకు,రోడ్లపైన ఉండే మానసిక వికలాంగుల వద్దకు స్వయంగా తన టీంతో వెళ్ళి ఉచితంగా కటింగ్‌ చేస్తామని చెప్పాడు. సిటీలోనే కాకుండా చౌటుప్పల్, స్టేషన్‌ ఘన్‌పూర్, నర్సాపూర్‌ తదితర ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నాడు. ఇప్పటి వరకు 40 ఆశ్రమాల్లో 3500 మందికి పైగా తమ సేవలు అందించామన్నారు.

సెలవుకు బదులు సేవ..
తను చేస్తున్న కార్యక్రమాలు నచ్చి సిటీలోని ప్రముఖ హేర్‌ సెలూన్స్‌లో పనిచేసే దాదాపు 40 మంది సభ్యులుగా చేరారని రాకేష్‌ చెప్పారు. వీరంతా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ సేవలు అందిస్తున్నారన్నారు. తమకు సెలవు దినమైన మంగళవారం రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఇందులో భాగంగా ప్రతీ ఆశ్రమానికి నెలలో కనీసం ఒకసారైనా వెళ్ళి ఈ సేవలు అందిస్తామని తెలిపాడు. ప్రతీ ఆదివారం తన సెలూన్‌లో వచ్చే పూర్తి ఆదాయాన్ని ఈ కార్యక్రమ నిర్వాహణకు ఉపయోగిస్తానని,ఈ కార్యక్రమ నిర్వాహణకు ఒక ఆశ్రమానికి 1500 వరకు ఖర్చువుతుందని, ఎవరి దగ్గరా నిధులు సేకరించమని రాకేష్‌ తెలిపాడు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు