విద్యాశాఖకు ఖాళీల దెబ్బ!    

27 Jun, 2019 10:55 IST|Sakshi

ఒక్క మండలానికి కూడా రెగ్యులర్‌ ఎంఈఓ లేరు

ప్రధానోపాధ్యాయులకే ఇన్‌చార్జ్‌ బాధ్యతలు

జిల్లాలో 862 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

సాక్షి, నల్లగొండ : ఖాళీల దెబ్బకు జిల్లా విద్యాశాఖ కుదేలవుతోంది. ఎంతో ప్రాధాన్యమున్న ఈ శాఖను ముందుకు నడిపే అధికారుల్లేక కునారిల్లుతోంది. జిల్లాలోని 31 మండలాలకు ఒక్కటంటే ఒక్క మండలానికి కూడా ఎంఈఓ (మండల విద్యాధికారి) లేడంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. ఏళ్ల తరబడి టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఇన్‌చార్జ్‌ లతోనే కాలాన్ని వెల్లదీసే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఉప విద్యాధికారులతో పాటు 31 మండలాలకు  ఒక్క రెగ్యులర్‌ అధికారి లేక పర్యవేక్షణ కొరవడింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. 

తొమ్మిదేళ్లుగా పదోన్నతులు ఏవీ?
విద్యాశాఖలో గడిచిన తొమ్మిదేళ్లుగా పదోన్నతులు లేవు. ఉపాధ్యాయుల్లో,ప్రభుత్వ ఉపాధ్యాయులు,జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయులుగా రెండు విభాగాలున్నాయి. వీరి మధ్య ఏళ్ల తరబడి సర్వీస్‌ రూల్స్‌ సమస్య తేలక పదోన్నతులన్నీ నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ సమస్య న్యాయస్థానంలో ఉంది. పదోన్నతులు కల్పించని కారణంగానే, ఇన్‌చార్జ్‌ల పాలన అనివార్యమవుతోందని  చెబుతున్నారు.జిల్లాలో 1483 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో పనిచేసే ఉప విద్యాధికారులతో పాటు మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు కూడా సరిపడా లేక విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

మూడు ఉప విద్యాధికారుల పోస్టులు ఖాళీ
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉండగా ఒక్కో డివిజన్‌కు ఒక ఉప విద్యాధికారి చొప్పున మూడు పదవులు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులో మాత్రమే అధికారి ఉండగా, మూడు డిప్యూటీ డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ డివిజన్లలో ఉప విద్యాధికారులుండాల్సి ఉండగా, ఆ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. మరో వైపు మొత్తం 31 మండలాలకు గానూ ఒక్కో మండలంలో ఒక్కో మండల విద్యాధికారి ఉండాలి. 31 మండలాల పరిధిలో ఒక్కరు రెగ్యులర్‌ ఎంఈఓ లేరు. కొన్నేళ్లుగా, ఆయా మండలాల్లో సీనియర్‌ ప్రధాన ఉపాధ్యాయులనే ఆయా మండలాల విద్యాశాఖ ఇన్‌చార్జులుగా పనిచేస్తున్నారు. 

862 ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీ
జిల్లాలో 862 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యావలంటీర్లతోనే ప్రతి విద్యాసంవత్సరాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది కూడా 832మంది విద్యావలంటీర్లుగా, గత సంవత్సరం బోధించిన వారినే రెన్యువల్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే దిశలో పావులు కదుపుతోంది. ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఎరికీ నష్టం జరగకుండా పదోన్నతులు కల్పించేందుకు సరైన ప్రణాళికలు తయారు చేయాలని సీఎస్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో తమకు త్వరలోనే పదోన్నతులు లభిస్తాయన్న ఆశాభావం టీచర్లలో వ్యక్తమవుతోంది.

కొరవడిన పర్యవేక్షణాలోపం
విద్యాశాఖలోని ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు నిత్యం పాఠశాలలు సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించి విద్యాబోధన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉప విద్యాధికారులు హైస్కూళ్లను తనిఖీ చేయాల్సి ఉండగా మండల విద్యాధికారులు ప్రతి రోజూ ఆయా మండలాల్లోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను పరిశీలించి అక్కడ బోధన సవ్యంగా సాగే విధంగా కృషి చేయాలి. ఎప్పటికప్పుడు వారి పరిధిలో పరిష్కారం కాగల సమస్యలను పరిష్కరించాలి. లేదంటే జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది.

కానీ సీనియర్‌ హెడ్‌మాస్టర్లనే ఇన్‌చార్జ్‌ ఎంఈఓలుగా నియమించడం వల్ల ఇటు ఆ పాఠశాల నిర్వహణ, విద్యా బోధనతోపాటు మండల విద్యాధికారి బాధ్యతలను కూడా నిర్వహించాల్సి వస్తోంది. ఇది కొత్త సమస్యలకు దారితీస్తోంది. ఇటు మధ్యాహ్న భోజనం, అందుకు సంబంధించిన చెల్లింపులు, రికార్డు చేయడం, తదితర పనులతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పనులన్నీ చూడలేక ఇన్‌చార్జి ఎంఈఓలు ఇబ్బందులు పడుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు