‘ఉద్యానవనం’.. ఉద్యోగులు శూన్యం!

10 Aug, 2014 02:50 IST|Sakshi

మోర్తాడ్ : జిల్లాలో ఉద్యానవన శాఖలోని ఖాళీలను, ఉన్న ఉద్యోగుల సంఖ్యను పరిశీలిస్తే పాలకుల హామీలు ఉత్తుత్తి మాటలుగానే ఉండిపోనున్నాయని స్పష్టమవుతుంది. జిల్లాలో 36 మండలాలు ఉండగా, కేవలం ఏడుగురు ఉద్యానవన శాఖాధికారులతోనే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో  క్షేత్రస్థాయిలో రైతులందరికీ ఉ ద్యానవన శాఖ పథకాలు అందడం లేదని వెల్లడవుతోంది.

జిల్లా అంతటికీ అసిస్టెంట్ డెరైక్టర్ పోస్టు ఒకటి , నాలుగు ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులు మాత్రమే ఉన్నాయి. నిజామాబాద్‌లో ఏడీఏ పోస్టు ఉంది. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడలలో ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులు ఉన్నాయి. కామారెడ్డి అధికారి బదిలీ కాగా, ఇంతవరకు భర్తీ కాలేదు. ఆ ర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్‌లలో మాత్రం  ఫీల్డు అసిస్టెంట్ పోస్టులు మూడు ఉన్నాయి.

 ఖాళీలతో లక్ష్యాలు చేరేనా
 వ్యవసాయానికి కూలీల కొరత ఏర్పడటం, పం టలకు గిట్టుబాటు ధరలు అంతగా లేకపోవడం తో చాలామంది రైతులు ఉద్యానవనాల పెం పుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఉద్యానవన శాఖ కూడా ఈ సంవత్సరం వంద హెక్టార్‌లలో పం డ్లతోటలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఉద్యోగులు తక్కువగా ఉండటంతో పండ్ల తోటల పెంపకం 50 శాతం కూడా సాగయ్యే సూచనలు కనిపించడం లేదు.

మామిడి, అరటి, బొప్పాయి, నారింజ, దానిమ్మ, బత్తాయి, జామ, నిమ్మ తదితర పండ్లతోటలను పెంచడంతో పాటు రైతులకు కూరగాయల విత్తనాలను సబ్సిడీ పద్ధతిలో అందించడం ఉద్యానవన శాఖ విధి. పండ్ల తోటల పెంపకంతో పాటు వ్యవసాయ పరికరాలు, పసుపు రైతులకు తగిన సూచనలు సలహాలు, పని ముట్లను ఉద్యానవన శాఖ ద్వారా అందిస్తున్నారు.

 పైరవీలు చేస్తేనే పనులు
 జిల్లాల్లో 36 మండలాలకు కేవలం ఏడుగురు ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మండలానికి ఒక ఉద్యానవన అధికారితోపాటు ఇద్దరు, ముగ్గురు ఫీల్డు కన్సల్టెంట్‌లు ఉంటేనే రైతులకు పరిపూర్ణంగా సేవలు అందుతాయి. ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఈ శాఖ ద్వారా అందించే పథకాలు క్షేత్రస్థాయిలో రైతులకు అందడం లేదు. పైరవీలు చేసిన వారికి మాత్రమే ఉద్యానవన పథకాల లబ్ధి చేకూరుతోందన్న విమర్శలు వస్తున్నాయి.  ఈ శాఖ ప్రయోజనాలు అందాలంటే ఉద్యోగుల సంఖ్యను త్వరితగతిన పెంచాల్సిన అవసర ముందని పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు