నిధులూ లేవు.. సార్లూ లేరు!

30 Jul, 2018 02:40 IST|Sakshi

లెక్చరర్ల బదిలీలతో ఖాళీగా గ్రామీణ జూనియర్‌ కాలేజీలు  

కనీసం గెస్ట్‌ లెక్చరర్లు కూడా లేక ఇబ్బందులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అవసరమైన లెక్చరర్‌ పోస్టులు భర్తీకాలేదు. గెస్ట్‌ లెక్చరర్ల నియామకంపై సర్కార్‌ స్పష్టత ఇవ్వలేదు. సార్లు రాక కోసం విద్యారులు ఎదురు చూపులు చూడటం తప్ప పాఠాలు ముందుకు సాగ ట్లేదు. మరోవైపు కాలేజీల ఖాతాల్లో నిధులు లేక కనీ సం చాక్‌పీస్, డస్టర్‌లు కూడా కొనలేని పరిస్థితి. ఇదీ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల దుస్థితి.  

కాంట్రాక్టు లెక్చరర్లే దిక్కు
రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కలిపి సుమారు 1.7 లక్షల మంది వరకు ఉంటారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా లెక్చరర్లు మాత్రం లేరు. మెజార్టీ కాలేజీలు కాంట్రాక్టు లెక్చరర్లతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. గతేడాది జూనియర్‌ లెక్చరర్లకు పదో న్నతి ఇచ్చారు. దీంతో అన్ని కాలేజీలకు ప్రిన్సిపాళ్లు ఉన్నారు. కానీ లెక్చరర్లకు మాత్రం కొరత ఏర్పడింది.

ప్రస్తుత విద్యా సంవత్సరం ఆరంభంలో జూనియర్‌ లెక్చరర్లను బదిలీ చేయడంతో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో గ్రామీణ ప్రాం తాల్లోని జూనియర్‌ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. గతేడాది గెస్ట్‌ లెక్చరర్లుగా పనిచేసి న వారిని ఈ ఏడాది కూడా కొనసాగించాలా లేదా అన్న దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో ఆ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీల సంగతిని కూడా ప్రభుత్వం ఎటూ తేల్చలేదు. దీంతో వారూ అసంతృప్తితో ఉన్నారు.  

కాలేజీల ఖాతాలు ఖాళీ
గతంలో ఓసీ, బీసీ విద్యార్థుల నుంచి సైన్స్‌ గ్రూపులకు రూ.835, హ్యుమానిటీస్‌ గ్రూపులకు రూ.530 చొప్పున వసూలు చేసి కాలేజీ ఖాతాలో జమ చేసేవారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌ నుంచి రూ.350 ట్యూషన్‌ ఫీజుగా కాలేజీలు మినహాయించుకునేవి. దీంతో ఒక్కో కాలే జీ ఖాతాలో ‘అక్యుములేషన్‌ ఫీజు’రూపంలో సగటు న రూ.3 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు నిల్వ ఉం డేవి. 2016–17 విద్యా సంవత్సరంలో కాలేజీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ హాజరు పరికరాల కోసం రూ.1.58 లక్షలు చొప్పున ‘అక్యుములేషన్‌’ ఖాతా నుంచి ఖర్చు చేయాల్సిందిగా కమిషనర్‌ ఆదేశించారు.

2011–12లో కొత్తగా మంజూరైన 102 జూనియర్‌ కాలేజీలకు కూడా పాత కాలేజీల అక్యుములేషన్‌ నిధులనే వినియోగించడంతో ఆయా కాలేజీల ఖాతాలు దాదాపు ఖాళీ అయ్యాయి. దీంతో ‘డే టు డే’నిధుల పేరిట కాలేజీల నిర్వహణకు 2017–18లో నిధులు ఇస్తామని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటిం చింది. అయితే విద్యా సంవత్సరం ముగిసినా నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో కాలేజీల్లో చాక్‌పీసులు, డస్టర్లు కూడా కొనే పరిస్థితి లేదని ప్రిన్సిపాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ ‘దహెగాం’ దయనీయ గాథ
కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా ‘దహెగాం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ’ 18 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇది నేటికీ జెడ్పీ స్కూల్‌ భవనంలోనే కొనసాగుతోంది. గతంలో రెండు గదుల షెడ్డు నిర్మించినా కరెంటు, తాగునీరు, ఫర్నిచర్‌ లేకపోవడంతో నిరుపయోగం గా మారాయి. గతేడాది పదోన్నతిపై వచ్చిన ప్రిన్సిపాల్‌ ఈ షెడ్డును వినియోగంలోకి తెచ్చి స్టాఫ్‌రూం, ప్రయోగశాల ఏర్పాటు చేశారు.

తరగతులు మాత్రం శిథిలావస్థకు చేరిన హైస్కూల్‌ గదుల్లోనే నిర్వహిస్తున్నారు. ఇందులో 200 మంది విద్యార్థులు ఉన్నారు. 10 మంది రెగ్యులర్‌ లెక్చరర్లకు గాను ఒక్కరూ లేక పోగా, 8 మంది కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. కాలేజీ నిర్వహణకు తాను ఖర్చు చేసిన రూ.60 వేలు ఇవ్వాలంటూ ప్రిన్సిపాల్‌ పలుమార్లు ఇంటర్‌ బోర్డుకు లేఖలు రాసినా ఫలితం లేదు.


గజ్వేల్‌లోనూ అదే పరిస్థితి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ బాలికల జూనియర్‌ కాలేజీలో 720 మంది విద్యార్థులున్నారు. గజ్వేల్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌లో భాగంగా అత్యాధునిక వసతులతో భవనం నిర్మించారు. అయితే ప్రిన్సిపాల్‌ మినహా ఒక్క రెగ్యులర్‌ లెక్చరర్‌ కూడా లేరు. కేవలం ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. గతేడాది 14 మంది గెస్ట్‌ లెక్చరర్లను నియమించారు. ప్రస్తుతం వారు కూడా లేరు. రెగ్యులర్‌ లెక్చరర్లు, సీనియర్‌ అసిస్టెంట్, పీడీ, లైబ్రేరియన్, వాచ్‌మన్, స్వీపర్‌ పోస్టులతో పాటు, ఫర్నిచర్‌ కావాలని బోర్డుకు లేఖలు రాసినా స్పందన లేదు.


పాఠాలు చెప్పే వారేరీ?
కాలేజీలో 170 మందికి పైగా విద్యార్థులు ఉన్నా గణిత, భౌతిక శాస్త్రాలకు మినహా మిగతా సబ్జెక్టులకు రెగ్యులర్‌ లెక్చరర్లు లేరు.కాలేజీ తెరిచి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ పాఠాలు మొదలవ్వలేదు. లెక్చరర్లు లేక విద్యార్థులు కూడా రెగ్యులర్‌గా కాలేజీకి రావడం లేదు. లెక్చరర్లు వస్తారని ఎదురు చూస్తూనే రెండు నెలలు గడిచిపోయాయి. – రాములు, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్, సదాశివపేట జూనియర్‌ కాలేజీ, సంగారెడ్డి

న్యాయం చేయలేకపోతున్నాం
జూనియర్‌ కాలేజీల్లో ప్రస్తు తం మౌలిక వసతులు కొంత మెరుగయ్యాయి. రెగ్యులర్‌ లెక్చరర్లు లేక, కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీ జరగక, నిర్వహణ నిధుల్లేక కాలేజీల నిర్వహణ క్లిష్టతరంగా మారింది. ప్రభుత్వ కాలేజీల మీద భరోసాతో వస్తున్న పేద విద్యార్థులకు న్యా యం చేయలేకపోతున్నాం. గెస్ట్‌ లెక్చరర్ల నియామ కంతో పరిస్థితి మెరుగు పడుతుందని ఆశిస్తున్నాం.
– కళింగ కృష్ణకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం

మరిన్ని వార్తలు