‘నా బిడ్డకు టాబ్లెట్స్ ఇచ్చి చంపేశారు’

8 Mar, 2019 20:43 IST|Sakshi
అస్వస్థతకు గురైన చిన్నారిని అత్యవసర వైద్యం కోసం తరలిస్తున్న దృశ్యం(పైల్‌)

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో గురువారం మహ్మద్‌ ఉమర్‌ అనే చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఉమర్‌ తల్లి జెబనాజ్‌ స్పందించారు. కుమారుడి మృతిపై ఆమె ఆగ్రహం వ్యకం చేశారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాబును టాబ్లెట్లు ఇచ్చి చంపేశారని ఆరోపించారు. తాము ఎల్బీనగర్‌నుంచి హాస్పిటల్‌కు వెళ్లేంత వరకు బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపింది. హాస్పిటల్లో రెండుసార్లు బాబుకి టాబ్లెట్స్ వేశారని, టాబ్లెట్స్ వేసుకున్న కొద్దిసేపటి వరకు బాబు నిద్ర లేవలేదని వెల్లడించింది. తాను బాబు దగ్గరకు వెళ్లి చూసే సరికి బాబుకి స్పర్శ లేకపోవడంతో డాక్టర్‌ దగ్గరకు వెళ్లానని తెలిపింది.

వారు బాబు చనిపోయాడని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారంది. హాస్పిటల్లో బాబు చనిపోయాడని నిర్థారించి ఎక్కడి వారు అక్కడకి వెళ్లిపోయారని, తాము అడగడానికి కూడా అక్కడ ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేసింది. హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఉమర్‌ చనిపోయాడని తెలిపింది. తన బాబు చావుకు కారణం అయిన వారిని ప్రభుత్వం జోక్యం చేసుకొని కఠిన శిక్ష పడేలా చూడాలని, తమ బాబుకి జరిగిన విధంగా ఎవరి పిల్లలకు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది.

మరిన్ని వార్తలు