భయం వద్దు.. ప్లాస్మాథెరపీ ఉంది!

5 Jun, 2020 05:11 IST|Sakshi

కరోనాను జయించిన వంశీకృష్ణ మనోగతం..

రాష్ట్రంలో ప్లాస్మా థెరపీతో కోలుకున్న తొలివ్యక్తి..

గాంధీ వైద్యుల సేవలు ప్రశంసనీయమని కితాబు

అల్వాల్‌ (హైదరాబాద్‌): కరోనా బారినపడితే ఏదో అయిపోతుందనే భయం వద్దు. ఈ వైరస్‌కు ప్రస్తుతానికి మందులు లేకున్నా.. వైద్యులు తమకున్న అనుభవంతో, ప్లాస్మా థెరపీ వంటి వివిధ చికిత్స పద్ధతులతో రోగులను కోలుకునేలా చేస్తున్న తీరు అద్భుతం. గాంధీ వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది ధైర్యం చెబుతూ రోగులను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు’ అని చెప్పారు హైదరాబాద్‌లోని అల్వాల్‌ ప్రగతిశీల్‌ కాలనీకి చెందిన వంశీకృష్ణ. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన ఇటీవలే గాంధీ ఆస్పత్రి నుంచి ఆరోగ్యవంతంగా ఇంటికి చేరుకున్నారు. వంశీకృష్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉన్నతోద్యోగి కాగా, ఆయన భార్య అడ్వకేట్‌. రాష్ట్రంలోనే ప్లాస్మా థెరపీ చికిత్స పొందిన మొదటి వ్యక్తి అయిన వంశీకృష్ణ గురువారం తన అనుభవాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..

కంటికిరెప్పలా చూసుకున్నారు..
‘ప్రతి గంటకు వైద్య సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే వారు. సమయానికి మందు లు, ఆహారం ఇవ్వడంతో పాటు వ్యాయామం చేయించడం ద్వారా రోగిని సంపూ ర్ణ ఆరోగ్యవంతుడిని చేస్తున్నారు. ప్లాస్మా థెరపీ పొందిన నన్ను గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎం డాక్టర్‌ రాజారావు కంటికిరెప్పలా చూసుకున్నారు. ఆయన స్వయంగా ప్రతి బాధితుని వద్దకు వెళ్లి క్షేమ సమాచారాలు అడిగే వారు. ధైర్యం నింపేవారు. రోగనిరోధక శక్తి బాగుంటే కరోనా నుంచి తేలిగ్గానే బయటపడొచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మను చూడ్డానికి తరచూ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లే క్రమంలో నాకు కరోనా వైరస్‌ సోకింది. దీంతో మే 11న నన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. నా భార్య, ఇద్దరు పిల్లలను ఆస్పత్రిలో క్వారంటైన్‌ చేశారు. మే 26న భార్యాపిల్లల్ని, 30న నన్ను వైద్యులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంటికి పంపారు. ప్రస్తుత కరోనా సమయంలో, దాని చికిత్సకు నూతన ఒరవడిగా చెబుతున్న ప్లాస్మా థెరపీ చికిత్సను రాష్ట్రంలో పొందిన మొదటి వ్యక్తిని నేనే. కరోనా నుంచి చికిత్సానంతరం కోలుకున్న ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తం నుంచి ప్లాస్మా సేకరిస్తారు. దాన్ని వైరస్‌తో బాధపడుతున్న వారికి అందిస్తారు. ఆరోగ్యవంతుడి నుంచి తీసుకున్న రక్తం ద్వారా రోగికి వ్యాధిని జయించే శక్తి వస్తుంది. ఈ చికిత్స విధానంలో నేను కొద్దిరోజుల్లోనే కరోనా నుంచి బయటపడ్డాను’.

ఇంటికొచ్చేసరికి ఇల్లు గుల్ల
కరోనా బారినపడి.. చికిత్స పొంది, ఆరోగ్యంగా ఇంటికి చేరుకునే సరికి వంశీకృష్ణ ఇల్లు గుల్లయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘ టన వివరాలు బాధితులు, పోలీసు లు తెలిపిన ప్రకారం.. గత నెల 11న వంశీకృష్ణకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయనతో పాటు భార్య, ఇద్ద రు పిల్లలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి క్వారంటైన్‌లో ఉంచిన వంశీకృష్ణ భార్యాపిల్లల్ని మే 26న ఇంటికి పంపారు. వారొచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బంగారం, నగదు, విలువైన సామగ్రి కనిపించలేదు. 10 తులాల బంగారం, రూ.30 వేలు, 2 ల్యాబ్‌టాప్‌లు, 3 ఐప్యా డ్‌లు చోరీ అయినట్టు గుర్తించి అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇంటి యాజమాని వంశీకృష్ణ చికిత్స పూర్తి చేసుకొని మే 30న ఇంటికి వచ్చారు. ఇంటికి సోలార్‌ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, ఆధునిక లాకింగ్‌ సదుపాయాలతో కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లున్నా కూడా దొంగతనం జరిగిన తీరు విస్తుగొలుపుతోంది. కాగా, ఘటన జరిగిన 8 రోజుల తరువాత ఈ నెల 4న అల్వాల్‌ పోలీసులు బాధితులకు ఎఫ్‌ఐఆర్‌ కాపీని అందచేశారు.

మరిన్ని వార్తలు