జైలులోనే చంపుతారా? 

13 Jul, 2020 02:32 IST|Sakshi

కన్నీరుమున్నీరైన వరవరరావు కుటుంబసభ్యులు  

అనారోగ్యంతో ఉన్నా ఆస్పత్రిలో చేర్చడం లేదు 

సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకుని మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలి

సాక్షి, హైదరాబాద్‌: నవీ ముంబైలోని తలోజా జైలులో విచారణ ఖైదీగా నిర్బంధంలో ఉన్న ప్రముఖ విప్లవకవి పి.వరవరరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, తక్షణమే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని ఆయన సహచరి హేమలత, కుమార్తెలు సహజ, అనలా, పావన విజ్ఞప్తి చేశారు. 79 ఏళ్ల వరవరరావు తీవ్ర అనా రోగ్యంతో బాధపడుతున్నా చికిత్స అందించకుండా జైలులోనే చంపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారు ఆదివారం విలేకరులతో మాట్లాడారు.

గత మే 28న జైలులో వరవరరావు స్పృహ కోల్పోవడంతో జేజే ఆస్పత్రికి తరలించారని, సోడి యం, పొటాషియం లెవల్స్‌ బాగా పడిపోయాయని కోర్టుకు ఆస్పత్రి నివేదించిందని వెల్లడించారు. 3 రోజు లకే ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి ఎన్‌ఐఏ తిరిగి జైలుకు తరలించిందన్నారు. జూన్‌ 24న, ఆ తర్వాత జూలై 2న వరవరరావు తమతో జైలు నుంచి ఫోన్‌ చేసి బలహీనమైన గొంతుతో అసంబద్ధంగా హిందీలో మాట్లాడారని వెల్లడించారు. చివరిసారిగా శనివారం ఆయన తమకు ఫోన్‌ చేసినా తీవ్ర అనారోగ్యం వల్ల సరిగ్గా మాట్లాడలేక పోయారని తెలిపారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, పొంతన లేకుండా మాట్లాడారని హేమలత, కుమార్తెలు కన్నీరుమున్నీర య్యారు. 

వరవరరావు 8 ఏళ్ల వయస్సులో తండ్రిని, 30 ఏళ్ల కింద తల్లిని కోల్పోయారని, అయితే తన తండ్రి, తల్లి అంత్యక్రియలకు వెళ్తున్నావు కదా అని ఫోన్లో తనను అడిగారని హేమలత ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాల నాటి ఘటనలకు సంబంధించిన భ్రమల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోడియం, పొటాషి యం లెవల్స్‌ పడిపోవడంతో మెదడు దెబ్బతింటుండడం వల్లే తమ తండ్రి మతిస్థిమితం కోల్పోయినట్టు వ్యవహరిస్తున్నారని ఆయన కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేశారు.  ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిందని, నడవలేకపోతున్నారని, ఒకరి సహాయం లేకుండా మరుగుదొడ్డికి వెళ్లలేకపోతున్నారని, పళ్లు తోముకోవడం కూడా కష్టంగా ఉం దని సహచర ఖైదీ పేర్కొన్నట్టు తెలియజేశారు.  ఒకరి ప్రా ణాలను తీసే హక్కు ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించలేదని వీవీ బావమరిది వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు