మోదీ హత్య ప్లాన్‌ : నన్ను టార్గెట్‌ చేశారు

8 Jun, 2018 18:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరిపారన్న వార్తలు ఆదివాసీల కోసం పోరాటం చేస్తున్న వారిని టార్గెట్‌ చేయడానికేనని విరసం నేత వరవరరావు వ్యాఖ్యానించారు. ప్రధాని హత్యకు కుట్ర లేఖలో తన పేరు ఉండటంపై వరవరరావు స్పందిస్తూ... ప్రధాని హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని తాను అనుకోవడం లేదన్నారు. ప్రధానిని హత్యచేసే శక్తి మావోయిస్టులకు ఉందా? అనేది కూడా అనుమానమేనని అన్నారు.

ఇటీవల మోదీ గ్రాఫ్ తగ్గుతుందని, ఆయన ఇమేజ్ను పెంచే చర్యగా తాను ఈ కుట్రను భావిస్తున్నానని ఆయన అన్నారు. రోనా జాకబ్‌ విల్సన్‌ భీమకోరేగావ్‌ ఘటనలో దొరకలేదని, ఢిల్లీ, పుణెలో దాడులు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని వరవరరావు పేర్కొన్నారు. తనపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన విల్సన్‌తో సంబంధం లేదని చెప్పనని, ఇదంతా తనను టార్గెట్‌ చేయడమే అనిపిస్తుందన్నారు.

అయితే, ఇందుకు సంబంధించి పోలీసులు ఎవరూ తనను సంప్రదించలేదని, మహా అయితే తనను కూడా అరెస్టు చేస్తారని, అంతకంటే ఏమీ కాదని వరవరరావు వ్యాఖ్యలు చేశారు. ప్రజాసంఘాలు, విప్లవ రచయితలను అణచివేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. కాగా, ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్రలోని భీమా కోరేగావ్‌లో జరిగిన హింసాత్మక ఘటనకు సంబంధించి కేసులో సుధీర్‌ దావలే, సురేంద్ర గాట్లింగ్‌, సోమా సేన్‌, మహేష్‌ రౌత్‌, రోనా జాకబ్‌ విల్సన్‌ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అయితే జాకబ్‌ విల్సన్‌ను అరెస్ట్‌ చేసిన ఇంటినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖ తాజాగా కలకలం రేపుతోంది. అరెస్ట్‌ అయిన జాకబ్‌ విల్సన్ ల్యాప్ టాప్లో ప్రధాని హత్యకు కుట్రపన్నారంటూ పూణె పోలీసులు ఓ లేఖను కోర్టుకు సమర్పించారు. మోదీని ఎలా హత్య చేయాలో మావోయిస్టులు లేఖల ద్వారా చర్చించుకోవడం లేఖలో స్పష్టంగా ఉన్నట్లు తెలిసింది.

మోదీని కూడా రాజీవ్ హత్య తరహా ప్రణాళిక రూపొందించాలని, ఇందుకు నాలుగు లక్షల రౌండ్ల బుల్లెట్లు, ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం పడతాయని లేఖలో పేర్కొంటూ, ఈ కుట్రలో వరవరరావు సహకారంతో డబ్బు సర్దుబాటు చేయాలని ప్రస్తావించారు. దీంతో పూణే పోలీసులు వరవరరావును కూడా ప్రశ్నించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు