వరవరరావు కేసులో మీ వైఖరి ప్రకటించండి

11 Apr, 2019 04:42 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ను కోరిన వరవరరావు సతీమణి

సాక్షి, హైదరాబాద్‌: మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం, సంఘ్‌ పరివార్‌ కుట్రలు పన్ని తప్పుడు ఆరోపణలపై ‘భీమా కొరేగాం హింసా కాండ కేసు’లో వరవరరావును ఇరికించిన విషయంలో మీ వైఖరేంటో బహిరంగంగా ప్రకటించాలని ఆయన సతీమణి హేమలత కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఇటీవల ఎన్నికల ప్ర చారంలో ప్రధాని మోదీ అబద్ధాలు, అక్రమాల మీద మీరు చేస్తున్న వ్యాఖ్యలు వింటుంటే వరవరరావుపై పన్నిన అబద్ధపు కేసు గురించి మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నానని ఆమె అందులో పేర్కొన్నారు.

గతంలో విప్లవ రచయితల సంఘంపై నిషే ధమున్న సమయంలో చంచల్‌గూడ జైలులో అక్రమ నిర్బంధంలో ఉన్న వరవరరావును 2005 సెప్టెంబర్‌ 3న కేంద్ర మంత్రి హోదాలో మీరు కలిసిన విషయాన్ని గుర్తుచేస్తున్నానని తెలిపారు. ప్రస్తుత అక్రమ నిర్భంధం కేసులోనూ అదే వైఖరి తీసుకుంటారని ఆశిస్తున్నా నని చెప్పారు. గత 45 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు వరవరరావుపై 25 అబద్ధపు కేసులు బనాయించారని, ఇవన్నీ రుజువుకాకపోయినా ఏడేళ్ల జైలు జీవితాన్ని గడిపారని గుర్తు చేశారు. ప్రస్తుతం పుణే పోలీసులు పెట్టిన కేసు, జైలులో ఉండగానే అహోరీలో బనాయించిన మరొక కేసు కూడా అబద్ధపు కేసులని, న్యాయస్థానాల్లో నిలబడవని, బీజేపీ ప్రభుత్వం అక్రమ నిర్బంధంలో ఉంచడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు.

ఆరోగ్యం బాగా లేని 79 ఏళ్ల వయసున్న వరవరరావును ఇలా వేధించడం అమానవీయం, చట్టవ్యతిరేకమని పేర్కొన్నారు. గతంలో అన్ని కేసుల విచారణకు హజరైనట్లే ఈ విచారణకు కూడా హాజరవుతారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వరవరరావును వెంటనే బెయిల్‌ మీద విడుదల చేయాలని కోరారు. మోదీ మీరు ప్రకటిస్తున్న వ్యతిరేకత నిజమైనదేనని, చిత్తశుద్ధి కలిగినదేనని చూపుకోవాలంటే వరవరరావు అక్రమ నిర్భంధం మీద మీ వైఖరి ప్రజలకు తెలపాలని హేమలత అభ్యర్థించారు.

మరిన్ని వార్తలు