నేడు రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర వడగాడ్పులు 

10 May, 2019 01:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే పొడివాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. ఇక శనివారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు(గంటకు 40 కి.మీ. నుంచి 50 కి.మీ.)లతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని పేర్కొంది. ఉత్తర ఇం టీరియర్‌ ఒడిశా నుంచి రాయలసీమ వరకు కోస్తాంధ్ర మీదుగా 0.9 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది.  

వడదెబ్బకు ఏడుగురు మృతి 
వడదెబ్బకు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకు చెందిన మాజీ ఉప సర్పంచ్‌ బచ్చు పురుషోత్తం (82), ఖమ్మం రూరల్‌ మండలం ఎదులాపురం గ్రామానికి చెందిన పొన్నెకంటి వెంకమ్మ (75),, వైరా మండలం కేజీ సిరిపురంలో దుప్పటి సత్యం (63), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ప్రకాశ్‌నగర్‌ కాలనీకి చెందిన చింతలచెరువు వీరస్వామి (59) మృతి చెందారు. అలాగే.. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం దుద్దెనపల్లి గ్రామానికి చెందిన బురగల్ల వెంకటయ్య (65), సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌ గ్రామానికి చెందిన కొమ్ముల చిన్నమల్లయ్య (55), ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో సందెవేణి మల్లయ్య (55) మృతి చెందిన వారిలో ఉన్నారు.  

మరిన్ని వార్తలు