పాలమూరుకు కొత్తశోభ..!

7 Nov, 2019 08:04 IST|Sakshi
శుభ్రం చేసిన తర్వాత

మెరుగుపడుతున్న పారిశుద్ధ్యం 

తొలగిన ‘ఓపెన్‌’ పాట్లు 

సాక్షి, మహబూబ్‌నగర్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులో చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక స్ఫూర్తితో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా స్థానిక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రత్యేక చొరవతో గత నెల 15న మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోనూ పట్టణ ప్రణాళిక ప్రారంభమైన విషయం తెలిసిందే. నెల రోజుల పాటు పట్టణంలో విస్తృతంగా పర్యటించి.. సమస్యల గుర్తింపుతో పాటు వాటి పరిష్కారానికి గడువు  విధించుకుని పనులు పూర్తి చేయాలన్న మున్సిపల్‌ అధికారులకు మిగతా అన్ని శాఖాధికారుల సహాయ సాకారాలు సంపూర్ణంగా అందాయి. ఫలితంగా మహబూబ్‌నగర్‌ పట్టణం సమస్య లు లేని మున్సిపాలిటీ దిశగా అడుగులేస్తోంది. 

ఫలితమిచ్చిన శాఖల సమన్వయం.. 
మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటినీ సమస్యలు లేని పురపాలికగా, ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్, మున్సిపల్‌ కమిషనర్‌ వడ్డే సురేందర్‌ ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు గత నెల 12న స్ధానిక మున్సిపల్‌ కార్యాలయంలో సమావేశమైన మిగతా అన్నిశాఖల జిల్లాస్థాయి అధికారులతో సమావేశమై ప్రణాళిక అమలులో భాగంగా పనుల గుర్తింపుతో పాటు వెంటనే చేయాల్సిన పనులు.. తర్వాత చేపట్టాల్సిన పనుల జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించారు.

ప్రస్తుతం పట్టణంలో 41 వార్డులుండగా.. ఒక్కో వార్డుకు ఓ జిల్లా లేదా డివిజన్‌స్థాయి అధికారితో పాటు ఓ మున్సిపల్‌ సిబ్బందిని నియమించారు. ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కేవలం కార్యక్రమం ప్రారంభానికే పరిమితం కాకుండా తనూ అధికారులతో కలిసి వార్డు బాట పట్టారు. తనవంతుగా పారిశుద్ధ్య పనులూ చేశారు. ప్రతి రోజూ గుర్తించిన సమస్యలతో పాటు పరిష్కరించిన వాటి వివరాలు కలెక్టర్‌తో కలిసి తెలుసుకున్నారు.

నిరంతర పర్యవేక్షణతో నియమిత స్పెషలాఫీసర్లు సైతం వార్డుల్లో విస్తృతంగా పర్యటించి సమస్యలకు పరిష్కారమార్గాలు చూపించారు. అయితే గుర్తించిన పనుల పూర్తికి ప్రత్యేక నిధుల మంజూరు లేకపోయినా.. అవసరమైన నిధులను జనరల్‌ ఫండ్‌ నుంచి వాడుకోవాలని అధికారులు నిర్ణయించారు. 

సాధించిన ప్రగతి ఇదీ.. 
పట్టణ సుందరీకరణ.. ఆదర్శ నగరం లక్ష్యంగా మొత్తం 22 అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నారు. పట్టణంలో అన్ని జంక్షన్‌ల అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత కోసం కాలనీల అసోసియేషన్ల భాగస్వామ్యం, వీధుల్లో చెత్త కుప్పల తొలిగింపు, డ్రెయినేజీలు శుభ్రం, ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు, దోమల నిర్మూలన చర్యలు, కూలిపోయిన ఇళ్లు, పాడుబడ్డ గృహాల తొలగింపు, రోడ్లపై గుంతల పూడ్చివేత, పందుల నిర్మూలన, ప్లాస్టిక్‌ వాడకం నిర్మూలనలో భాగంగా జరిమానాల విధింపు, నీటి సరఫరా పైప్‌లైన్ల లీకేజీల మరమ్మతు, మొక్కలు నాటడం, వీధి దీపాల మరమ్మతు, కొత్తవి ఏర్పాటుతో పాటు రోడ్ల నిర్మాణం, విస్తరణ పనుల వేగవంతం, జడ్చర్ల–మహబూబ్‌నగర్‌ రహదారి విస్తరణ పనుల పూర్తిపై ప్రధానంగా దృష్టిసారించిన అధికారులు ఆ మేరకు పనులు చేపట్టారు.

ఇప్పటి వరకు అత్యధికంగా 2,078 ఓపెన్‌ ప్లాట్లను గుర్తించిన స్పెషలాఫీసర్లు ఇప్పటి వరకు 1630 ప్లాట్లలో ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లను, నీటి నిల్వలను తొలగించి చదును చేశారు. ముందుగా ఓపెన్‌ ప్లాట్లలో పెరిగిన చెట్లు, నీటి నిల్వ గురించి ఆయా యజమానులకు సమాచారం అందజేసి మూడు, నాలుగు రోజుల్లో వాటిని శుభ్రం చేసుకోవాలని నోటీసులు ఇచ్చారు. స్పందించని యజమానుల ప్లాట్లను మున్సిపల్‌ అధికారులే శుభ్రం చేసి.. జేసీబీ, డంపింగ్‌ యార్డు వరకు చెత్త తరలింపు కోసం ఇతర వాహనాలకు అయ్యే ఖర్చును జరిమానా పేరిట వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ.4లక్షలకు పైగా జరిమానాలు వసూలు చేశారు.

ఇక మీదట ఓపెన్‌ ప్లాట్లలో చెట్లు పెరగకుండా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అత్యధికంగా మూడో వార్డులో 230 ఓపెన్‌ ప్లాట్లను గుర్తించిన ప్రత్యేకాధికారులు 120 ప్లాట్లను చదును చేశారు. 19వ వార్డులో 150 ప్లాట్లకు గానూ 25, 16వ వార్డులో 111 ప్లాట్లకు 76, 12వ వార్డులో 104 ప్లాట్లకు 99, ఏడో వార్డులో 93 ప్లాట్లకు 90, 41వ వార్డులో 93 ప్లాట్లకు గానూ 81 ప్లాట్లు చదును చేశారు. ఇప్పటికే పట్టణంలో లోపించిన పారిశుద్ధ్యంతో విష జ్వరాలు, డెంగీ వంటి వ్యాధులు ప్రబలిన నేపథ్యంలో అధికారులు తీసుకున్న ఓపెన్‌ ప్లాట్ల చదును కార్యక్రమంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అందరి కృషితోనే.. 
మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్, స్పెషలాఫీసర్లందరీ సమష్టి కృషితో గడిచిన కొన్ని రోజుల్లోనే పట్టణంలో అనేక సమస్యలు తీరాయి. పట్టణ ప్రణాళికలో భాగంగా స్పెషలాఫీసర్లు గుర్తించిన పనుల్ని రెండు, మూడు రోజుల్లోనే పరిష్కరించుకుంటున్నం. కార్యక్రమం గడువుకు ఇంకా సమస్య ఉన్నందునా మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తాం. అయితే ఈ కార్యక్రమం నెల రోజులకే పరిమితం కాకూడదు.

ప్రజలూ పట్టణ పౌరులుగా తమ బాధ్యతను గుర్తించుకుని పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలి. ముఖ్యంగా ఓపెన్‌ ప్లాట్ల విషయంలో ఆయా యజమానులు శ్రద్ధ తీసుకుని పిచ్చి మొక్కలు పెరగకుండా, నీటి నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి.  
– వడ్డే సురేందర్, మున్సిపల్‌ కమిషనర్‌   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా