‘వర్క్‌టూ రూల్’కు స్వస్తి!

10 Nov, 2014 01:53 IST|Sakshi

మహబూబ్‌నగ్ టౌన్: ఇటీవల కొద్దిరోజులుగా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, రెవెన్యూ ఉద్యోగుల మధ్య రగులుతున్న వర్క్‌టూ రూల్ వివాదం ఇక సమసినట్లే..! జేసీ మధ్యవర్తిత్వంతో చర్చలు సఫలమై.. ఉద్యోగులు కలెక్టర్‌కు సహకరిస్తామని ఆదివారం ప్రకటించారు. ఇదిలాఉండగా, కలెక్టర్ జిల్లా కు వచ్చిరాగానే ప్రభుత్వం రకరకాల సర్వేలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగంపై కూడా కొంత పనిఒత్తిడి పెరిగింది. సామాజిక భద్రత పింఛన్లు, రేషన్‌కార్డులకు సంబంధించి అర్హులను గుర్తించే క్రమంలో అధికారు లు, సిబ్బందితో కలెక్టర్ ఒక్కోసారి రాత్రి సమయం వరకు కూడా  సమీక్ష లు నిర్వహిస్తుండేవారు. ఈ పరంపరలో సీసీకుంట వీఆర్వో రంగారెడ్డి గుండెపోటుతో మృతిచెందాడు. పనిఒత్తిడి కారణంగానే సదరు వీఆర్వో చనిపోయారని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు దిగిన విషయం విదితమే. అర్ధరాత్రి వరకు సమావేశాలు నిర్వహించకుండా పనిలో స్వేచ్ఛాయుత వాతావరణం ఇవ్వాలని వారు కలెక్టర్‌కు విజ్ఞప్తిచేశారు.

స్పందించిన కలెక్టర్ విధుల నిర్వహణ పట్ల కాస్త కఠినంగానే ఉంటానని ప్రకటించడంతో ఉద్యోగులు నిరసనబాట పట్టారు. రెండురోజులుగా జిల్లాలో విధులు బహిష్కరిస్తూ వర్క్‌టూ రూల్‌ను అమలుచేశారు. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వీరికితోడు ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడంతో కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగుల యుద్ధ వాతావరణం రాజుకుందనే చెప్పొచ్చు. నాలుగైదు రోజులుగా సమస్య ఓ కొలిక్కిరాకపోవడంతో రెవెన్యూ ఉద్యోగులు ఏకంగా సీఎం సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు.

అంతటితో ఆగకుండా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం చేపట్టిన ఉద్యమం తరహాలో కొనసాగిస్తామని ప్రకటించారు. జేసీ ఎల్.శర్మన్ సమస్య మరింత ముందుకు పోకుండా పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్, రెవెన్యూ ఉద్యోగులకు మధ్యవర్తిత్వం వహించి శనివారం రాత్రి రెవెన్యూ అసోసియేషన్ నేతలను కలెక్టర్‌తో చర్చలకు ఆహ్వానించారు. సుమారు రెండుగంటలపాటు కొనసాగిన చర్చల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషిచేయడంతో ఉద్యోగులు మెత్తబడ్డారు. విధుల నిర్వహణలో కలెక్టర్‌కు సహకరిస్తామని అంగీకరించారు. దీంతో వర్క్‌టూ రూల్ విధానానికి స్వస్తి పలికినట్లయింది.
 
కలెక్టర్‌కు పూర్తిగా సహకరిస్తాం

కొంత ఇబ్బందులు కలిగినా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని స్పందించి తమకు పూర్తిగా సహకరించి సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారని, ఆమెకు విధుల పట్ల అన్నివిధాలుగా సహకరిస్తామని రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ప్రకటించారు. ఆదివారం స్థానిక రెవెన్యూభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్ధరాత్రి సమావేశాలతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు.

కలెక్టర్ అంగీకరించి పదోన్నతులు సైతం ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. ఇది ఒక కుటుంబ సమస్యేనని, పరిష్కరించుకున్నట్లు తెలిపారు. సమావేశంలో టీజీఓ అధ్యక్షుడు రామకృష్ణగౌడ్, కార్యదర్శి బక్క శ్రీనివాస్, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు