వారంలో వర్సిటీ అధ్యాపక నోటిఫికేషన్లు

11 Apr, 2018 03:31 IST|Sakshi

     1,061 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్న ఉన్నత విద్యామండలి

     పాత రోస్టర్‌ ప్రకారమే నియామకాలకు యూజీసీ ఓకే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,061 పోస్టుల భర్తీకి వారంలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. పోస్టు ల భర్తీలో వర్సిటీలవారీగానే రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) స్పష్టం చేయడంతో అందుకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలోనూ పోస్టుల భర్తీలో వర్సిటీలవారీగానే రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్‌ను అమలు చేస్తూ పోస్టులను భర్తీ చేసేవారు. అయితే ఇటీవల అలహాబాద్‌ హైకోర్టు వర్సిటీలవారీగా కాకుండా యూనివర్సిటీల్లో సంబంధిత విభాగాలవారీగానే రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్లను పోస్టుల భర్తీలో అమలు చేయాలని తీర్పు ఇవ్వడంతో యూజీసీ అన్ని వర్సిటీల వీసీలకు ఈ మేరకు లేఖలు రాసింది. దీంతో రాష్ట్రంలోని వర్సిటీలు గందరగోళంలో పడ్డాయి.

పోస్టుల భర్తీలో యూనివర్సిటీలవారీగా రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్లు పాటించాలా లేక యూజీసీ తాజా నిబంధనల ప్రకారం పోస్టులను విభాగాలవారీగా రోస్టర్‌ కమ్‌ రిజర్వేషన్లు అమలు చేయాలా అనే విషయాన్ని ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో నోటిఫికేషన్ల జారీ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి దీనిపై యూజీసీ అధికారులతో చర్చించారు. అయితే అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ అలహాబాద్‌ హైకోర్టు ధర్మాసనం ఎదుట అప్పీల్‌ చేసేందుకు సిద్ధమైందని, అందువల్ల ప్రస్తుతానికి పాత విధానం ప్రకారమే పోస్టులను భర్తీ చేయాలని యూజీసీ సూచించింది. దీంతో త్వరలోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని యూనివర్సిటీలకు సూచించినట్లు పాపిరెడ్డి వెల్లడించారు.

మరిన్ని వార్తలు