వైన్... ఇక చౌక!

30 Sep, 2016 15:54 IST|Sakshi
వైన్... ఇక చౌక!

రాష్ట్రంలో వైన్‌పై వ్యాట్‌ను 150 శాతం నుంచి 70 శాతానికి తగ్గించిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో విక్రయించే దేశీయ తయారీ వైన్ చౌకగా లభించనుంది. వైన్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను ప్రభుత్వం భారీగా తగ్గించింది. దేశంలో తయారయ్యే వైన్ మీద వాణిజ్య పన్నుల శాఖ 150 శాతం పన్ను విధిస్తుండగా, దానిని 70 శాతానికి తగ్గించింది. అలాగే వైన్ మీద ఎక్సైజ్ డ్యూటీ, దేశీయ తయారీ పన్నులను కూడా క్రమబద్ధీకరించింది. రూ. 2 వేల లోపు ధర గల కార్టన్ (కేసు) వైన్ ప్రాథమిక ధరపై 28% ఉన్న ఎక్సైజ్ డ్యూటీని ఏకంగా 90 శాతానికి పెంచింది.

కాగా ఇప్పటి వరకు రూ. 2 వేలకు పైబడిన వైన్ కేసు ప్రాథమిక ధరపై 15% లేదా రూ. 560లలో గరిష్టంగా ఉన్న మొత్తాన్ని ఎక్సైజ్ డ్యూటీగా విధిస్తున్నారు. దానిని క్రమబద్ధీకరించి రూ. 2 వేల నుంచి రూ. 3 వేలు గల వైన్ కేసు ప్రాథమిక ధరపై 15% లేదా రూ.1,800లలో గరిష్ట మొత్తాన్ని ఎక్సైజ్ డ్యూటీగా విధించనున్నారు. ఇక రూ. 3వేల పైబడి ధర గల వైన్ కార్టన్ల ప్రాథమిక ధరలపై 10% పన్ను లేదా రూ. 450 లలో గరిష్ట మొత్తాన్ని పన్నుగా విధించనున్నారు. అంటే ఎక్కువగా విక్రయించే తక్కువ ధర గల వైన్ ఉత్పత్తులపై పన్నును పెంచిన ప్రభుత్వం అధిక ధర గల వైన్ తయారు చేసే కంపెనీలకు పన్ను తగ్గించింది.

దీంతో వ్యాట్ సగానికి పైగా తగ్గినా సర్కార్ ఆదాయానికి ఢోకాలేని పరిస్థితి. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా దేశంలో పూర్తి ద్రాక్ష పండ్లతో తయారయ్యే వైన్ బాటిళ్ల ఎంఆర్‌పీ ధరలు 30 నుంచి 35% వరకు తగ్గనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్ తెలిపారు. ఫోర్ట్‌ఫైడ్ వైన్  ధర సీసాకు రూ. 5 పెరుగుతాయని వివరించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా