పదవీకాలం ముగిసినా.. 

5 Nov, 2019 03:14 IST|Sakshi

నిర్ణీత వ్యవధిలో వీసీల నియామకాలు! 

వర్సిటీల కొత్త చట్టాల్లో నిబంధనను పొందుపరిచేలా కసరత్తు  

నాలుగు రకాలుగా యూనివర్సిటీల చట్టాలు 

తుది మెరుగులు దిద్దుతున్న ఉన్నత స్థాయి కమిటీ 

త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక  

సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్‌ (వీసీ) పదవీకాలం ముగిసిన తరువాత నిర్ణీత వ్యవధిలోనే మళ్లీ వైస్‌ చాన్స్‌లర్‌ను నియమించే నిబంధన రాబోతోందా? అంటే ఉన్నత విద్యాశాఖ వర్గాల నుంచి అవుననే సమాధానం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఏపీలో రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీల నియామకాలు చేపట్టడంతో నెలల తరబడి జాప్యం జరిగేది. అలాంటి జాప్యాన్ని నివారించే చర్యలపై ఉన్నత విద్యా శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు విద్యావేత్తలు, నిపుణులు, వర్సిటీల ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వర్సిటీల చట్టాల రూపకల్పన కమిటీకి తెలియజేసినట్లు సమాచారం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని 11 వర్సిటీలకు వేర్వేరు చట్టాలు, వేర్వేరు నిబంధనలు ఉన్న నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రభు త్వం ఒకే రకమైన వర్సిటీలకు ఒకే రకమైన చట్టాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా గతేడాది ఉన్నత విద్యా మండలి ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆ కమిటీ తమ నివేదికను రూపొందించింది. దానిపై వర్సిటీల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది.

ఆ అభిప్రాయాల్లో కొన్నింటిని తమ నివేదికలో పొందుపరిచే చర్యలు చేపట్టింది. సోమవారం కూడా ఓయూ మాజీ వీసీ ప్రొఫెసర్‌ సులేమాన్‌ సిద్ధిఖీ, ఓయూ లా డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ జీబీ రెడ్డి, రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డి, నిరంజన్‌చారి తదితరులతో కూడిన కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా తమకు వచ్చిన అభిప్రాయాలను పరిశీలించింది. ప్రధానంగా వీసీల పదవీ కాలం పూర్తి కాగానే నిర్ణీత వ్యవధిలోనే మళ్లీ వీసీలను నియమించాలన్న నిబంధనను పొందుపరచాలని సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం కమిటీ ఆ నిబంధననూ çపరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 7న మరోసారి సమావే«శమై తుది నివే దిక ఖరారు చేయనుంది. వీలైతే అదే రోజు లేదంటే వారంలోగా ప్రభుత్వానికి తమ సిఫారసులతో కూడిన వర్సిటీల కొత్త చట్టాల తుది నివేదిక అందజేసేందుకు చర్యలు చేపట్టింది.  

భౌగోళిక స్వరూపాల్లోనూ మార్పులు.. 
ఈ చట్టాల్లో 60 నుంచి 70 శాతం వరకు కామన్‌ నిబంధనలే ఉండనున్నాయి. చాన్స్‌లర్, వీసీ, రిజిస్ట్రార్‌ వంటి నియామకాల నిబంధనలు ఒకే రకంగా ఉండనున్నాయి. మిగతా 30 నుంచి 40 శాతం నిబంధనలు మాత్రం ఆయా యూనివర్సిటీల ప్రత్యేకతకు అనుగుణంగా ఉంటాయి. బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో సబ్జెక్టు సంబంధమైన కొన్ని నిబంధనలు వేర్వేరుగా ఉండబోతున్నాయి. వర్సిటీ భౌగోళిక స్వరూపాల్లో మార్పులకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ త్వరలోనే నివేదికను ఇవ్వనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత ఆయా జిల్లాలు ఏ వర్సిటీకి దగ్గరగా ఉంటాయో ఆ వర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టింది. ఆ నివేదికను తెప్పించుకొని, వీలైతే ఆ అంశాలను కూడా యూనివర్సిటీల చట్టాల్లో పొందుపరిచే అవకాశం ఉంది.

నాలుగు రకాల చట్టాలు.. 
ముఖ్యంగా 11 యూనివర్సిటీలకు 4 రకాల చట్టాలను తీసుకొచ్చేలా కమిటీ సిఫారసు చేస్తోంది. ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ వంటి సంప్రదాయ వర్సిటీలకు ఒక చట్టాన్ని సిఫారసు చేసేలా నివేదికను సిద్ధం చేస్తోంది. జేఎన్టీయూ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, బాసరలోని ఆర్జీయూకేటీ వంటి టెక్నికల్‌ వర్సిటీలకు ఒక చట్టాన్ని సిఫారసు చేస్తోంది. తెలుగు వర్సిటీని, భవిష్యత్తులో ఏదైనా భాషా సంబంధ వర్సిటీలు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకునేలా లాంగ్వేజ్‌ అండ్‌ కల్చర్‌వర్సిటీల చట్టం ఉండాలని పేర్కొంటోంది. అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీకి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని సిఫారసు చేస్తోంది. దీనిలో భాగంగా గత చట్టాల్లో ఉన్న లోపాలు పునరావృతం కాకుండా పరిశీలన జరుపుతోంది.  

మరిన్ని వార్తలు