ఈ ఏడాది నయమే..

22 May, 2020 09:24 IST|Sakshi

అందుబాటులో కూరగాయల ధరలు

సాక్షి సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ ప్రభావం కూరగాయలపై తక్కువగా ఉందనే చెప్పవచ్చు. ఇతర నిత్యావసర ధరలు కాస్త పెరిగినా కూరగాయల ధరలు అదుపులోనే ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నుంచే ధరలు తగ్గుముఖం పట్టాయి. నగరానికి శివారు జిల్లాల నుంచి దిగుమతి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో దాదాపు అన్ని కూరగాయల ధరలు రూ. 40 లోపు ఉన్నాయి. శివారు జిల్లాలనుంచి నగరానికి దిగుమతులు పెరగడంతో ధరలు అదుపులోనే ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

గత ఏడాది తీవ్ర ఇబ్బందులు
నగరవాసి గత సంవత్సరం కూరగాయలు కొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఏ కూరగాయలు కొందామన్నా కిలో రూ. 50 నుంచి రూ.60 ధర పలికేది. ఇక బహిరంగ మార్కెట్‌లో ధరలు ఇష్టానుసారంగా ఉండేవి.  పచ్చి మిర్చి, బీన్స్, టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు ఎక్కువగానే ఉండేవి. అయితే ఈ సంవత్సరం ధరలు తగ్గడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏ రకం అయినా కిలో రూ.40 ఉండటం ఊరటనిస్తుంది.  

ధరలు నిలకడగానే ఉన్నాయి
 గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు తక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా  రంగారెడ్డి, వికారాబాద్, మెదక్‌ జిల్లాల రైతులు ఈ ఏడాది అధిక సంఖ్యలో సాగుచేశారు.గతంలో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సమస్య లేదు.    – చిలుక నర్సింహారెడ్డి  కార్యదర్శి, ఎల్బీనగర్‌ మార్కెట్‌ కమిటీ

మరిన్ని వార్తలు