కూరగాయలు చౌక!

9 Feb, 2020 08:21 IST|Sakshi

ఈ సీజన్‌లోనే అత్యల్ప రేటు నమోదు.. 

దాదాపు అన్ని కూరగాయలు కేజీ రూ.20 నుంచి రూ.40 లోపే 

శివారు జిల్లాల నుంచి భారీగా దిగుమతులు 

మార్చి నెలాఖరు వరకు ఇవే ధరలు 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కూరగాయల ధరలు భారీగా తగ్గాయి. గత రెండు మూడు నెలలతో పోలిస్తే ఫిబ్రవరి తొలివారంలో దాదాపు అన్ని కూరగాయల ధరలు కిలో రూ.20 నుంచి 40 లోపే ఉన్నాయి. ఇది ఈ సీజన్‌లోనే అత్యల్పంగా చెప్పొచ్చు. సాధారణంగా సెప్టెంబర్‌–మార్చి మాసాల మధ్య కాలంలో లోకల్‌ కూరగాయల దిగుబడులు అధికంగా ఉండి రేట్లు తగ్గుతాయి. కానీ ఈసారి డిసెంబర్‌ వరకు కూడా రేట్లు తగ్గలేదు. జనవరి ఫిబ్రవరి మొదటి వారంలో మాత్రం దిగుబడి ఒకేసారి భారీగా రావడంతో కూరగాయల రేట్లు దిగొచ్చాయి. ముఖ్యంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, మెదక్, నిజామాబాద్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి నగర మార్కెట్‌కు కూరగాయల దిగుమతులు పెరిగాయి. ప్రస్తుతం బెండకాయ, వంకాయ, చిక్కుడు, బీన్స్‌తో పాటు ఇతర కూరగాయలు కిలో ధర రూ.20 నుంచి రూ.40 వరకు పలుకుతున్నాయి. ఇక టామాట ధర కిలో రూ.10 నుంచి రూ. 20 మధ్యే ఉంది. ఈ సీజన్‌లో టమాట ధర ఇంత తక్కువగా ఉండడం ఇదే తొలిసారి. 

గత ఏడాదితో పోలిస్తే... 
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్‌ రెండవ వారం నుంచే కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. నగరానికి శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతులు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. అంతకు ముందు వరకు ఏ కూరగాయలు కొనాలన్న కిలో రూ.60 నుంచి రూ.80 వరకు ధరలు పలికాయి. రాబోయే రోజుల్లో కూరగాయల ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్‌ అధికారుల అంచనా.  

పెరిగిన దిగుమతులు 
అన్‌సీజన్‌లో అంటే మార్చి నుంచి జూలై వరకు నగర మార్కెట్‌కు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయల దిగుమతి అవుతాయి. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. వేసవిలో స్థానికంగా రైతులకు నీటి లభ్యత ఎక్కువగా ఉండకపోవడంతో కూరగాయల సాగు కష్టమవుతుంది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. అందువల్లే రేట్లు ఎక్కువ ఉంటాయన్నారు. ప్రస్తుతం నగరంలోని బోయిన్‌పల్లి, గడిమల్కాపూర్, కొత్తపేట, ఎల్‌బీనగర్‌తో పాటు ఇతర మార్కెట్‌లకు రోజుకు 70 నుంచి 80 శాతం వివిధ రకాల స్థానిక కూరగాయలు దిగుమతి అవుతున్నాయి.  

స్థానికంగా దిగుబడి పెరిగింది.. 
తెలంగాణ వ్యాప్తంగా నీటి లభ్యత ఎక్కువగా ఉంది. రైతులు ఎక్కువగా కూరగాయలు పండిస్తున్నారు. ప్రత్యేకంగా రంగారెడ్డి, వికారాబాద్, మెదక్‌ జిల్లాల రైతులు ఈ ఏడాది జూలై, ఆగస్టు నెల నుంచే కూరగాయల సాగు చేస్తున్నారు. దీంతో అక్టోబర్‌ నుంచే కూరగాయల పంట చేతికి వచ్చింది. దిగుమతి పెరిగింది. అందువల్లే దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు తగ్గాయి. ప్రస్తుతం నగర ప్రజల 80 శాతం కూరగాయల అవసరాలు శివారు జిల్లాలే తీరుస్తున్నాయి.      

– చిలుక నర్సింహారెడ్డి, 
ఎల్‌బీ నగర్‌ మార్కెట్‌ గ్రేడ్‌–3 కార్యదర్శి 

మరిన్ని వార్తలు