దిగుబడులు కిందకు.. ధరలు పైపైకి

19 Jun, 2020 07:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో వినియోగదారులకు కూరగాయలు పూర్తిగా అందుబాటులోకి వచ్చినా వాటి ధరలు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెరగడం, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవడం..ఇదే సమయంలో డిమాండ్‌కు తగ్గట్లు దిగుమతి లేకపోవడంతో ధరలు అనూహ్యంగా పెరుగుతున్నా యి. వారం పదిరోజుల కిందటి ధరలతో పోల్చినా ఏకంగా రూ.20 నుంచి రూ.30వరకు పెరుగుదల కనిపిస్తోంది.  

అనూహ్యంగా పెరుగుదల... 
టమాటా ధరల్లో అనూహ్య పెరుగుదల కనిపిస్తోంది. పది రోజుల కిందటి వరకు సైతం బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.10 పలుకగా, ప్రస్తుతం రూ.30కి చేరింది. రాష్ట్రంలో అధికంగా సాగు చేసే మెదక్, సిద్దిపేట రంగారెడ్డి జిల్లాల నుంచి హైదరాబాద్‌ మార్కెట్‌కు టమాటా రాక తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. వేసవిలో బోర్ల కింద వేసిన సాగు పూర్తవ్వడం, ఇప్పుడు కొత్తగా సాగు జరుగుతున్న నేపథ్యంలో డి మాండ్‌ మేరకు పంట రావడం లేదని అంటున్నారు.

ఇక రాష్ట్రానికి అధికంగా ఏపీలోని మదనపల్లి, కర్ణాటకలోని చిక్‌మగళూర్‌ నుంచి రోజుకు 2వేల నుంచి 3వేల క్వింటా ళ్లు దిగుమతి అవుతుండగా ..ఇప్పుడది 1,500 క్వింటాళ్లకు తగ్గింది. దీనికి తోడు ప్రస్తుతం మదనపల్లి మార్కెట్‌లోనే కిలో టమాటా రూ.20 వరకు పలుకుతోంది. రవాణా ఖర్చులు కలుపుకొని అమ్మే సరికి దాని ధర రూ.30–35కి చేరుతోంది. గడిచిన 4 రోజులుగా బోయిన్‌పల్లి మార్కెట్‌కు వచ్చిన పంటను గమనిస్తే దిగుమతుల తగ్గుదల తెలుస్తోంది. ఈ నెల 15న మార్కెట్‌కు 3,074 క్వింటాళ్లు రాగా, 16న 2,870, 17న 251 క్వింటాళ్లు రాగా 18న గురువారం కేవలం 1,313 క్వింటాళ్లు›మాత్రమే వచ్చింది. దీంతో హోల్‌సేల్‌ మా ర్కెట్‌లోనూ కిలో టమాటా 4 రోజుల కిందట రూ.15 ఉండగా, ఆ ధర ప్రస్తుతం రూ.24కు చేరింది.అది రైతుబజార్‌లలో రూ.25–28 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి దాని ధర రూ.30–35కి చేరింది. 

ఇతర కూరగాయల ధరలు పైపైకి.. 
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి, ఎల్బీనగర్‌ మార్కెట్‌లకు లాక్‌డౌన్‌ సమయంలో రోజుకు 30–35 వేల క్వింటాళ్ల మేర అన్ని రకాల కూరగాయలు వచ్చేవి. బోయిన్‌పల్లి మార్కెట్‌కే 20 వేల క్వింటాళ్లకు పైగా వచ్చిన రోజులున్నాయి. ఈ నెల 15న బోయిన్‌పల్లి మార్కెట్‌కు అన్ని రకాల కూరగాయలు కలిపి 18,468 క్వింటాళ్ల మేర రాగా, 16న 16,471 క్వింటా ళ్లు, 17న 15,741 క్వింటాళ్లు రాగా, 18న గురువారం 10,937 క్వింటాళ్లే వచ్చింది.

పది రోజుల కిందటి ధరలతో పోలిస్తే ప్రతీదానిపై రూ.20–30 వరకు పెరిగాయి. కాకర కిలో రూ.35, వంకాయ రూ.35, క్యాప్సికం రూ.70, బీన్స్‌ రూ.50, క్యారెట్‌ (బెంగళూరు) రూ.50, దొండ రూ.32–35, పచ్చిమిర్చి రూ.45, బెండ రూ.30 వరకు ఉండగా, బీరకాయ రూ.60 పలుకుతోంది. ఆలు ధర వారం కింద రూ.20 ఉండగా, ప్రస్తుతం రూ.40కి చేరింది. ఉల్లి ధరలు మాత్రం వినియోగదారులకు అందుబాటు లో ఉన్నాయి. రూ.100కు 6 నుంచి 7 కిలోల వంతున విక్రయిస్తున్నారు. పంటలసాగు మొదలవడంతో మరో 3 నెలల పా టు ధరల్లో పెరుగుదల ఉంటుందని మార్కెటింగ్‌ వర్గాలు తెలిపాయి.   

మరిన్ని వార్తలు