‘టీబీని తరిమేద్దాం ’

31 Oct, 2019 03:43 IST|Sakshi

అంతర్జాతీయ టీబీ వ్యాధి నిరోధక సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య  

గచ్చిబౌలి:  దేశం నుంచి క్షయ(టీబీ) వ్యాధిని 2025 నాటికి నిర్మూలించేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. బుధవారం మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఇంటర్నేషనల్‌ యూనియన్‌ అగినెస్ట్‌ ట్యూబర్‌కులోసిస్, లంగ్‌ డిసీజెస్‌ (ఐయూఏటీబీఎల్డీ) ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరగనున్న ‘ఊపిరితిత్తుల ఆరోగ్యం’పై అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనలో ప్రభుత్వాల ప్రయత్నాలకు ప్రైవేట్‌ రంగంతోపాటు సమాజం కలసి రావాలని అన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని ప్రైవేట్‌ వైద్యరంగానికి సూచించారు.  

కలసికట్టుగా పనిచేద్దాం
ఐదేళ్లలో లక్ష్యాలను నిర్దేశించుకుని టీబీని తరిమేసేందుకు కలసికట్టుగా పనిచేస్తే భారత్‌ విజయం సాధిస్తుందని వెంకయ్య అన్నారు. క్షయ తోపాటు ఊపిరితిత్తుల వ్యాధుల ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్రం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని అన్నారు. రివైజ్డ్‌ నేషనల్‌ టీబీ కంట్రోల్‌ ప్రోగ్రాం ద్వారా భారత్‌లో టీబీ వ్యాధిగ్రస్తుల శాతం 1.7 శాతానికి తగ్గిందన్నారు. ఇన్నోవేటివ్‌ మెడికల్‌ సైన్స్, బయో మెడికల్‌ రంగం పురోగతిలో తెలంగాణ వేగంగా దూసుకెళ్తుందని ప్రశంసించారు. కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, కేంద్ర సహాయ మంత్రి అశ్వినీకుమార్‌ చౌబే, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, ఐయూఏటీబీఎల్డీ అధ్యక్షుడు జెరెమియ్య, ఉపా«ధ్యక్షుడు లూయిస్‌కాస్లో, టీఎఫ్‌సీసీఐ అ«ధ్యక్షుడు వెంకటేశ్వర్లు, 130 దేశాల నుంచి 400 మంది వైద్యులు పాల్గొన్నారు.  

టీబీ రహిత దేశమే లక్ష్యం : కేంద్ర మంత్రి అశ్వినీకుమార్‌ 
మన్సూరాబాద్‌: 2025 నాటికి టీబీ రహిత దేశమే లక్ష్యంగా ప్రణాళికలను రూపొందించుకుని ముందుకెళ్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్‌ చౌబే అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ నగర్‌లోని కామినేని అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో కామినేని ఆస్పత్రి ఆడిటోరియంలో బుధవారం టీబీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కేంద్ర మంత్రి అశి్వనీకుమార్‌ చౌబే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డిలు హాజరయ్యారు. చౌబే మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి టీబీ మహమ్మారిని తరిమేయాలని నిర్దేశించుకుందని, ఇటీవల జరిగిన బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ 2025 కల్లా భారత్‌లో టీబీని అంత మొందిస్తామని పేర్కొన్నారని తెలిపారు.  టీబీపై తెలంగాణ ప్రభుత్వ కృషి అభినందనీయమని, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందన్నారు. 

ఆరోగ్య తెలంగాణే.. బంగారు తెలంగాణ: ఈటల
ఆరోగ్య వంతమైన తెలంగాణను నిర్మిద్దాం.. ఆరోగ్య తెలంగాణ అయిననాడే బంగారు తెలంగాణ అని సీఎం కేసీఆర్‌ నమ్ముతున్నారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. 2025 నాటికి దేశాన్ని టీబీ నుంచి విముక్తి చేస్తామని ప్రధాని చెబుతున్నారని, తెలంగాణలో అంతకు ముందే టీబీని ప్రారద్రోలుతామని అన్నారు. కార్యక్రమంలో కామినేని అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రిన్సిపాల్‌ జి.సత్యనారాయణ, కామినేని వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు