దేశభక్తిని ప్రేరేపించే సంగీతం

24 Feb, 2020 01:38 IST|Sakshi
ట్రోఫీని అందజేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

అడ్డగుట్ట: ఆలిండియా పోలీస్‌ బ్యాండ్‌ కాంపిటీషన్‌ 20వ ముగింపు వేడుకలు ఆదివారం సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ (ఆర్‌ఎస్‌సీ) గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. సంగీతం సాయుధ దళాలలో ధైర్యాన్ని, శౌర్యాన్ని రేకెత్తిస్తుందన్నారు. దేశభక్తిని, దేశ రక్షణపై నిబద్ధతను ప్రేరేపిస్తుందన్నారు. నిజాయితీతో కూడిన సేవలతో అవసరమైన మిత్రుడిగా ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించాల్సిన బాధ్యత దేశంలోని అన్ని పోలీసు దళాలకు ఉందన్నారు.

ఆలిండియా పోలీస్‌ బ్యాండ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు అన్ని సాయుధ, పారా సైనిక దళాల మధ్య సహకారాన్ని మెరుగుపరుస్తాయని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. పోటీలను ఆర్‌పీఎఫ్‌ జాతీయ స్థాయిలో 3వసారి నిర్వహిస్తోందన్నారు. అనంతరం, బ్రాస్‌ బ్యాండ్‌ క్యాటగిరీలో 20వ ఆల్‌ ఇండియా పోలీస్‌ బ్యాండ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేత ట్రోఫీని సీఆర్‌పీఎఫ్, పైప్‌ బ్యాండ్‌ ట్రోఫీని మహారాష్ట్ర పోలీసులకు అందజేశారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా, అదనపు జీఎం బి.బి.సింగ్, దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ సెక్యూరిటీ కమీషనర్‌ ఈశ్వరరావు పాల్గొన్నారు. 

వరంగల్‌పై ప్రత్యేక ప్రేమ 
సాక్షి ప్రతినిధి, వరంగల్‌: కాకతీయుల సుపరిపాలనకు కేంద్రమైన ఓరుగల్లుకు రావడం.. ఇక్కడి గడ్డపై జరిగే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. వరంగల్‌లో ఆంధ్రా విద్యాభివర్ధిని (ఏవీవీ) కళాశాల 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడారు. వరంగల్‌ సాంస్కృతిక వారసత్వం ఘనమైనదని, ప్రఖ్యాతి గాంచిన ఓరుగల్లు ఖిలాతో పాటు, వేయి స్తంభాల గుడి, రామప్ప, లక్నవరం, పాకాల వంటి అతి పెద్ద చెరువులు వరంగల్‌ నగరానికి కంఠాభరణాల్లాంటివని కొనియాడారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న నగరం కాబట్టే.. కేంద్ర ప్రభుత్వం.. ఓరుగల్లును ‘హెరిటేజ్‌ సిటీ డెవలప్‌మెంట్‌’పథకం కింద మరింత అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు