శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు

9 Jan, 2020 18:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని శిల్పారామం సంక్రాంతి శోభను సంతరించుకుంది. గురువారం శిల్పారామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. తాను సాధారణ స్థాయి నుంచి ఉప రాష్ట్రపతి స్థాయి వరకు వెళ్లానని.. నాకు వేరే ఆశలు లేవన్నారు. ఈ సంక్రాంతి ప్రజలందరికి క్రాంతి ప్రసాదించాలన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని..కట్టు,బొట్టు మరిచిపోకూడదని పిలుపునిచ్చారు. సంపాదించిన దాంట్లో కొంత ఇతరులకు సాయం చేయాలన్నారు.

తెలుగు భాష అమ్మఒడి లాంటిదని అందరూ కాపాడుకోవాలన్నారు. శిల్పారామంలో గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో నటులు మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్, హీరో వెంకటేష్, ముప్పవరపు కుటుంబ సభ్యులు, సుజనా చౌదరి, పరిటాల శ్రీరామ్, అశ్వినీదత్, ఎమ్మెల్సీ రామచంద్రారావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ గవర్నర్ తమిళి సై, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

నిజ జీవితంలోనూ ఆయన రోల్‌మోడల్‌..
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా సంక్రాంతి పండగ జరుపుకోవడం గొప్పగా ఉందని గవర్నర్‌ తమిళసై అన్నారు. రాజకీయాల్లోనే కాదని..నిజ జీవితంలోనూ వెంకయ్యనాయుడు రోల్‌మోడల్‌ అని కొనియాడారు. ఎంతో మంది పేదలకు సేవలందిస్తున్న స్వర్ణభారతి ట్రస్ట్‌ను అభినందించారు.

నిరుద్యోగులకు చేదోడువాదోడుగా నిలిచారు..
ఢిల్లీకి రాజైన తల్లికి మాత్రం కొడుకే అనే విధంగా సొంతగడ్డకు వెంకయ్యనాయుడు సేవలు అందిస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. నిరుద్యోగ యువతకు వెంకయ్యనాయుడు చేదోడు వాదోడుగా నిలిచారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఉంటున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులను తెచ్చి రైతాంగానికి నీరివ్వాలని కోరారు.

ఎంతో మందికి ఆయన స్ఫూర్తి..
పేదలకు ఏదో ఒకటి చేయాలనే కోరుకునే వ్యక్తి వెంకయ్యనాయుడు అని, తన లాంటి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ముప్పువరపు ఫౌండేషన్‌,స్వర్ణ భారతి ట్రస్ట్‌తో వేలాది మందికి ఉపాధి కల్పించారని తెలిపారు.

సంక్రాంతికి నా సినిమా విడుదల కావడం సంతోషంగా ఉంది..
సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు పండగ సంక్రాంతి అని..ఇదే పండగకు తన సినిమా విడుదల కావడం సంతోషంగా ఉందని హీరో మహేష్‌ బాబు అన్నారు.


మరిన్ని వార్తలు