ఖమ్మంలో ఎరుపు.. మరుపు

16 Mar, 2015 07:19 IST|Sakshi

ఖమ్మం: ‘ఖమ్మం ఒకప్పుడు ఎరుపుగా ఉండేది.. ఇప్పుడు అది మరుపు అయింది. ఇంకా కొన్ని రోజులైతే అదీ ఉండదు.. ఆ పార్టీల్లో త్యాగాలు చేసినవారు ఉన్నారు. కానీ ఇప్పుడు వారు అనుసరించే విధానాలు సరికావు’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కమ్యూనిస్టు పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్‌రావు విజయాన్ని కాంక్షిస్తూ బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘చైనానే కమ్యూనిజాన్ని వదిలేసింది.. రష్యాలో సోషలిజం లేదు. మన దేశంలో ఈ విధానాలు కావాలట..! ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని నినాదాలు ఇస్తారు.

 

ఇక్కడైతే మేము వేరుగా ఉంటాం’ అనేలా కమ్యూనిస్టుల వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర స్థాయిలో చట్టాలపై సమగ్రంగా చర్చ జరిగేదే శాసన మండలని, దీనికి మంచి నాయకత్వ గుణం ఉన్న వారినే ఎన్నుకోవాలన్నారు. ఆ లక్షణాలు, దక్షత, ఓర్పు అన్నీ రామ్మోహన్‌రావులో ఉన్నాయని ఆయనకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీని, వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వేయాలన్నారు. కేంద్రం స్కాలర్‌షిప్, సబ్సిడీలను నేరుగా అర్హుల ఖాతాలోనే వేస్తోందన్నారు. దేశాన్ని స్వచ్ఛ భారత్ దిశగా పయనింప చేయాలన్నది ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశమని.. ఆయన ఇచ్చిన నినాదాన్ని దేశ వ్యాప్తంగా ప్రజలు అందుకొని పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం హర్షించదగిన విషయమన్నారు. ఈ ఏడాది దేశంలోని అన్ని పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్రం సంకల్పించిందన్నారు. రామ్మోహన్‌రావు 20 ఏళ్లుగా పార్టీలకు అతీతంగా సామాజిక సేవ చేశారని, ఆయన్ను గెలిపిస్తే కేంద్రం నుంచి మూడు జిల్లాలకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

 

ప్రజా సమస్యలు పట్టించుకోకుండా  మంత్రుల ప్రచారమా..?:  రామ్మోహన్‌రావు
టీఆర్‌ఎస్ డబ్బున్న అభ్యర్థిని బరిలో దింపిందని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్‌రావు అన్నారు. ఈ ఎన్నిక కోసం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏడుగురు మంత్రులను ప్రచారం కోసం తిప్పుతోందన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షం లేకుండా ఏకపక్షం చేయూలని చూస్తున్నారని అది ఎప్పటికీ సాధ్యంకాదన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యువతకు ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం శోచనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

 

నామా జన్మదిన వేడుకలు
మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేదికపైనే నామా కేక్ కట్ చేశారు. బీజేపీ, టీడీపీ నేతలు నామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, రాష్ర్ట ఉపాధ్యక్షులు ఎం.ధర్మారావు, కార్యవర్గ సభ్యులు గెంటల విద్యాసాగర్, దుద్దుకూరి వెంకటేశ్వర్‌రావు, నేతలు చందా లింగయ్య, జిల్లా కార్యదర్శి గెల్లా సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వీరభద్రప్రసాద్, కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంగల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గోవర్దన్, జయచంద్రారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, నేతలు బేబి స్వర్ణకుమారి, ఫణీశ్వరమ్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు