విద్యారంగం తోడ్పాటుతోనే గ్రామీణాభివృద్ధి

1 Mar, 2019 08:01 IST|Sakshi
సదస్సులో బ్రౌచర్‌ను ఆవిష్కరిస్తున్న వెంకయ్య. చిత్రంలో పాపిరెడ్డి తదితరులు

ఇందుకు ఉన్నత విద్యా సంస్థలు కృషి చేయాలి

‘పని విద్య’ సదస్సు ముగింపు సమావేశంలో ఉపరాష్ట్రపతి

సాక్షి, హైదరాబాద్‌: విద్యారంగం తోడ్పాటుతోనే గ్రామీణాభివృద్ధి సాధ్యం అవుతుందని.. అప్పుడే దేశం సమగ్రాభివృద్ధి సాధించినట్లవుతుందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. మహత్మాగాంధీ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌ (ఎంజీఎన్‌సీఆర్‌ఈ) ఆధ్వర్యంలో నయ్‌ తాలిమ్‌ (పని విద్య)పై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రెండ్రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో వెంకయ్య పాల్గొని ప్రసంగించారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు ఉన్నత విద్యా సంస్థలు ఇతోధిక కృషి చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.  

సిలబస్‌లో మార్పులు అవసరం 
రైతుల స్థితిగతులు, పంటలు, వాటికి లభిస్తున్న ధరలు, గ్రామీణ పరిస్థితులు, నిజ జీవితం ఏంట న్నది భవిష్యత్తు తరాలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఇందుకు అనుగుణంగా సిలబస్‌ మార్పులు చేయాలన్నారు. గ్రామీణ విద్యా వ్యవస్థ బలోపేతానికి విద్యా రంగం చర్యలు చేపట్టాలని, అప్పుడే వలసలు ఆగిపోతాయన్నారు. పట్టణీకరణ వేగంగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, నీతిఆయోగ్, మీడియా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. తాను ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టానన్నారు. అందుకే గడిచిన 16 నెలల్లో యూనివర్సిటీలు, పరిశోధన, సాంకేతిక విద్యా సంస్థలు, వ్యవసాయ స్థితిగతులు, సాంస్కృతిక సంస్థలు, పారిశ్రామిక రంగాలు, ఎన్‌జీవోలతో తరచూ సమావేశం అవుతున్నట్లు చెప్పారు. యువతకు నైతిక విలువలు, పని విద్య, పర్యావరణ పరిరక్షణ, శానిటేషన్‌ అంశాలపై ప్రత్యేక అవగాహన అవసరమని విద్యా సంస్థలు ఆ దిశగా కృషి చేయాలన్నారు.
 
మాతృభాష మరవొద్దు: భాషలెన్ని నేర్చుకున్నా మాతృభాషను మరువొద్దని వెంకయ్య అన్నారు. మాతృభాష మన కళ్లు అయితే ఇతర భాషలు కళ్ల జోడులాంటివని చెప్పారు. ప్రాథమిక విద్య కచ్చితంగా మాతృభాషలోనే కొనసాగేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ విద్యాభివృద్ధికి ఇప్పటికే పలు చర్యలు చేపట్టినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. గ్రామాల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు.  రూరల్‌ మేనేజ్‌మెంట్‌ను తప్పనిసరి చేయాలన్నారు. సదస్సుకు దేశంలోని 102 వర్సిటీలు, 17 సెంట్రల్‌ వర్సిటీల విద్యావిభాగం అధిపతులు, ప్రొఫెసర్లు, వైస్‌ చాన్స్‌లర్లు హాజరయ్యారని సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంజీఎన్‌సీఆర్‌ఈ చైర్మన్‌ ప్రసన్నకుమార్‌ తెలిపారు. గ్రామీణ విద్యకు సంబంధించిన పాఠ్య పుస్తకాల రూపకల్పనకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు