ప్రజలకు పోలీసులకు మధ్య నమ్మకం తగ్గింది

1 Mar, 2018 02:30 IST|Sakshi

ట్రైనీ ఐపీఎస్‌ అధికారుల సమావేశంలో వెంకయ్య

సాక్షి, హైదరాబాద్ ‌: దేశంలో ప్రజలకు, పోలీసులకు మధ్య నమ్మకం కొరవడిందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఏదైనా సమస్య వస్తే పోలీసుల వద్దకు వెళ్లడమనేది ప్రజలకు చివరి ఎంపికగా మారిందన్నారు. ఈ పరిస్థితి మారాలని, సమస్య వస్తే ముందుగా పోలీసుల వద్దకు వెళ్లాలన్న భావన కలగాలని పేర్కొన్నారు. అందుకోసం యువ పోలీసు అధికారులు పాటుపడాలని సూచించారు. బుధవారం సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌ అధికారుల సమావేశంలో వెంకయ్యనాయుడు కీలక ప్రసంగం చేశారు.

ఈ సమావేశానికి రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అకాడమీ డైరెక్టర్‌ డాక్టర్‌ డోలే బర్మన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మానవత్వానికి ప్రతీకగా పోలీసులు నిలవాలన్నారు. పరస్పర నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పోలీసులు ప్రజలు కలిసి ముందుకు రావాల్సిన అవసరముందన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించారు.

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య టెర్రరిజమని, నక్సలిజం కూడా సమస్యగా మారిందన్నారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడటంలో పోలీసులు కృషిచేయాలని వెంకయ్యనాయుడు అన్నారు.

మరిన్ని వార్తలు