ఐఏఎస్ కుమారుడే అంతం చేశాడు!

21 Mar, 2017 21:40 IST|Sakshi
ఐఏఎస్ కుమారుడే అంతం చేశాడు!

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన కారు డ్రైవర్ బుక్యా నాగరాజు(28) హత్యకేసులో మిస్టరీ వీడింది. నాగరాజు హత్య కేసులో ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు, అతని కొడుకు వెంకట్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు విషయాలను వివరించారు. డ్రైవర్ నాగరాజును ఐఏఎస్‌ అధికారి కుమారుడు వెంకట్ సుక్రు హత్య చేశాడని వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి..  యూసఫ్‌గూడలోని సాయి కల్యాణ్‌ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పై నాగరాజు, వెంకట్ సుక్రు కలసి పార్టీలు చేసుకునేవారు.

అసభ్య ప్రవర్తనే ప్రాణం తీసింది
శుక్రవారం రాత్రి వీరిద్దరూ పార్టీ చేసుకుందామని అపార్ట్ మెంట్ టెర్రస్‌పైకి వెళ్లారు. కొంత సమయం మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నాగరాజు వెంకట్‌ సుక్రుతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాగరాజును సుక్రు ఇటుకతో కొట్టి హత్యచేశాడు. హత్య చేసిన తర్వాత తండ్రికి వెంకట్‌ సమాచారం ఇచ్చాడు. నాగరాజు మృతదేహాన్ని మాయం చేసేందుకు ఏం చేయాలో చెప్పాలని తండ్రిని వెంకట్ సుక్రు అడిగాడు. మొదట అక్కడినుంచి పరారైన సుక్రు, ఆ తర్వాత అర్ధరాత్రి సమయంలో తండ్రి వెంకటేశ్వరరావుతో కలిసి అపార్ట్‌మెంట్‌కి వచ్చాడు.

నాగు మృతదేహాన్ని మూటగట్టి తరలించడానికి వెంకటేశ్వర్లుకు చెందిన కారును వినియోగించాలని చూశారు. అపార్ట్‌మెంట్ వాసులు ఇది గమనించడంతో కథ అడ్డం తిరిగి దొరికిపోయారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తొలుత వెంకటేశ్వర్లును, ఆ తర్వాత అతని కొడుకు సుక్రును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెల్లడైందని డీసీపీ వివరించారు.

మరిన్ని వార్తలు