రిట్‌ దాఖలు చేసిన వేణుగోపాల్‌

22 Nov, 2019 03:10 IST|Sakshi

ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని వినతి

సాక్షి, హైదరాబాద్‌: పోలీసులు తనపై అక్రమంగా కేసులు బనాయించారని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాల ని కోరుతూ సీనియర్‌ జర్నలిస్ట్, వీక్షణం మాసపత్రిక సంపాదకుడు ఎన్‌.వేణుగోపాల్‌ హైకోర్టును ఆశ్రయించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం, తెలంగాణ ప్రజా భద్రతా చట్టం కింద తనపై అక్రమ కేసు బనాయించారని, ఇది భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని హైకోర్టుకు తెలిపారు. ఈ రిట్‌ను గురువారం న్యాయమూర్తి జస్టిస్‌ గండికోట శ్రీదేవి విచారించారు. ఈ కేసు పూర్తి వివరాలు, బెయిల్‌ మంజూరు అంశాలపై వైఖరిని తెలపాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. హైదరాబాద్‌లో ఈ నెల 12న ఎన్‌.రవిశర్మ, బి.అనూరాధను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో హఠాత్తుగా వేణుగోపాల్‌ పేరును నిందితుడిగా చేర్చి పోలీసులు ఆయనను వేధింపులకు గురిచేస్తున్నారని వేణుగోపాల్‌ తరఫు న్యాయవాది రఘునాథ్‌ రిట్‌ దాఖలు చేశారు. ఆ ఇద్దరి రిమాండ్‌ కేసు డైరీలో ఉద్దేశపూర్వకంగా ఆయనను ఏడో ముద్దాయిగా పేర్కొన్నారన్నారు.

మరిన్ని వార్తలు