సిటీ థ్రిల్స్‌.. పార్టీ స్టైల్స్‌..

21 Dec, 2019 09:21 IST|Sakshi

ఇది వింటర్‌ సీజన్‌. వెచ్చని పార్టీల సీజన్‌. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్‌ను వేడి వేడి క్రేజీ పార్టీస్‌ ద్వారా తరిమికొట్టడం సిటీలోని పార్టీ లవర్స్‌కి బాగా ఇష్టం. దీనికి తోడు క్రిస్మస్‌ మొదలుకుని సంక్రాంతి దాకా వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్‌ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పార్టీల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో సిటీలో క్రేజీగా మారిన కొన్ని పార్టీల విశేషాలు...

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పార్టీలకు  థీమ్‌ని జత చేయడం అనేది ఎప్పటికప్పుడు మరింత కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. నలుగురం కలిశామా తిన్నామా తాగామా తెల్లారిందా అన్నట్టు కాకుండా తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మార్చాలని మోడ్రన్‌ సిటీ ఆశిస్తోంది. అందుకని వెరైటీ స్టైల్స్‌ కోసం అన్వేషిస్తోంది.  సిటీలో ఇప్పుడు బాగా క్రేజీగా మారిన పార్టీ స్టైల్స్‌లో...

కూల్‌... పూల్‌..
సిటీలో స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉన్న స్టార్‌ హోటల్స్‌ ఉన్నాయి. అలాగే సొంత భవనాలూ కొందరికి ఉన్నాయి. దీంతో పూల్‌ పార్టీ కూడా క్రేజీగా మారింది.  ఈ వేడుక మొత్తం పూల్‌ దగ్గరే జరుగుతుంది. దీనిలో భాగంగా వాటర్‌ గేమ్స్, ఆక్వా డ్యాన్స్‌ వంటివి ఉంటాయి. పూల్‌ పార్టీలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల థగథగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి

డెస్టినేషన్‌.. పేషన్‌
ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్‌ చేసుకోవడం ఎలా ఉన్నా... ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్‌ ఫీలింగ్‌ వచ్చేసి ఆటోమేటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్‌ పార్టీలు నగరంలో క్లిక్‌ అవడానకి కారణం అదే . ప్రస్తుతం బ్యాచిలర్‌ పార్టీలు ఎక్కువగా డెస్టినేషన్‌ ఈవెంట్స్‌గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్‌ ఈవెంట్స్‌ నిర్వాహకులు రాజ్‌కిషోర్‌ చెప్పారు. 

పాట్‌ లాక్‌... ఫుడ్‌ క్లిక్‌...
చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్‌ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్‌లాక్‌ని బాగా క్లిక్‌ చేసింది. పాట్‌లాక్‌ కోసం ఒక వ్యక్తి హోస్ట్‌గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచ్చిన, వచ్చిన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్ధాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు.    

ట్రెడిషనల్‌... ట్రెండీగా...
సంక్రాంతి టైమ్‌లో ట్రెడిషనల్‌ పార్టీస్‌ ఎక్కువగా జరుగుతుంటాయి.వేడుక  అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్‌ యాక్టివిటీస్‌ ఉంటాయి. వీటికి తమ టీనేజ్‌ పిల్లల్ని తీసుకుని రావడానికి పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్‌ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడతాయనే ఆలోచన దీనికి కారణమన్నారు.

ఆరోగ్యకరం... ఆర్గానిక్‌  
ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు బాగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పార్టీస్‌కి కూడా వచ్చేసింది. ఆర్గానిక్‌ పార్టీలు షురూ అయ్యాయి. సిటీలో చాలా మందికి పార్మ్‌ హౌజ్‌లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్‌ హౌజ్‌లో పార్టీ ప్లాన్‌ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలు, నృత్యాలు వచ్చీరాని సేద్యం కూడా చేసేసి, సహజమైన పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తన్నారు. 

మరిన్ని వార్తలు